Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: కరీబియన్ దీవులను దారుణంగా దెబ్బతీసిన 'ఇర్మా' తుఫాన్ ఇప్పుడు క్యూబాపై విరుచుకుపడింది. దీని ప్రభావంతో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్చిపెలాగో దీవిపైన ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే దీనిని ఐదో కేటగిరికి చెందిన హరికేనుగా నిర్ణయించారు. శుక్రవారం రాత్రి నుంచి ఇర్మా విపరీతంగా బలపడింది. కొన్ని దశాబ్దాల అనంతరం ఐదో కేటగిరికి చెందిన తుఫాన్ క్యూబాను తాకిందని అధికారులు వెల్లడించారు. దీంతో తీరప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు విపరీతంగా ప్రభావితం అవుతున్నాయి. క్యూబాలోని కైబేరియన్ పట్టణానికి 190 కిలోమీటర్ల దూరంలో ఇర్మా కేంద్రీకృతమైనట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే తీరప్రాంత పట్టణమైన కైబేరియన్లో 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు కమాగ్యూ, కైగోడి అవైలా, సాన్ట్సీ స్పిరిటస్, విల్లా క్లారా ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తోంది. చాలా చోట్ల విద్యుత్తు, టెలిఫోన్ సౌకర్యాలు నిలిచి పోయాయి. మరోపక్క ఇవి కొండిపాంతాలు కావడంతో మెరుపు వరదల ముప్పు పెరిగిపోయింది.
దీంతో దిగువ ప్రాంతాల్లో నివసించేవారిని తరలిస్తున్నారు. మరోపక్క క్యూబా నుంచి దాదాపు 50 వేల మంది పర్యాటకులు వెళ్లిపోయారు. దీంతో చాలా రిసార్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇర్మా హరికేను ఆదివారం నాటికి అమెరికాలోని ఫ్లొరెడా రాష్ట్రాన్ని తాకవచ్చని అంచనావేస్తున్నారు.
మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సుమారు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. ఇర్మా వల్ల కరీబియన్ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందినట్టు అంచనా వేస్తున్నారు.