Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్కుబిక్కుమంటున్న టాంపా తీరం, మియామీ ప్రజలు
- 36 గంటలపాటు భారీ వర్షాలు, ప్రచండ గాలులు
ఫ్లోరిడా : వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్టుగానే...ఫ్లోరిడాను భీకర రూపంతో 'ఇర్మా' తుఫాన్ తాకింది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో గంటకు 209 కి.మీ వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలు ముంచెత్తాయి. తుఫాన్ తీవ్రత నాలుగో కేటగిరిలో ఉందని, గాలులు...భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్ని కొద్ది గంటల్లోనే ముంచెత్తే ప్రమాదముందని ఆదివారంనాడు 'అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం' తెలియజేసింది. 'ఇది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాలకు ముప్పుతెచ్చే వాతావరణ పరిస్థితి'గా అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం ప్రజల్ని హెచ్చరించింది. 'సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి' అంటూ అధికారులు ప్రకటనలు చేశారు. ఫ్లోరిడా తీరంలో వాయువ్య దిశగా ఇర్మా వేగంగా కదులుతున్నది.
- తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ మీడియాకు తెలియజేశారు. 4.30 లక్షల ఇండ్లల్లో, వ్యాపార భవనాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రహదారులన్నీ జలమయ్యాయి. బలమైన గాలులకు తీర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది.
- తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఫ్లోరిడాలోని టాంపా, మియామీ, ఓర్లాండో, జాక్సోవిల్లే తదితర ప్రాంతల నుంచి 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా టాంపా తీర ప్రాంతం వెంబడి 'ఇర్మా' ప్రతాపం ఎక్కువగా కనపడుతున్నది.
- మియామీలో 60 లక్షల మంది ప్రజలపై తుఫాన్ ప్రభావం పడింది. మరికొద్ది గంటలు గడిస్తేగానీ పరిస్థితి ఏంటన్నది తెలియదు !
- టాంపా తీరం వెంబడి నివసిస్తున్న 30 లక్షల మంది ప్రజలపై పెనుప్రభావం పడింది. ఇర్మాతోపాటే జోసే, కతియా అనే మరో రెండు తుఫాన్లు కూడా రాబోతున్నాయి. ఈ రెండూ కేటగిరి 4 తుఫాన్లుగా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
- ఇర్మా ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యికిపైగా తెలుగు కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. మరోవైపు జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, అలబామాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో ఇప్పటివరకూ 25 మందికి పైగా మరణించారు.
10-20 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం !
ఆదివారం రాత్రికి టాంపా ప్రాంతం మీదుగా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. 10 నుంచి 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఫ్లోరిడా కీవెస్ట్ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
మియామి, టాంపా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అక్కడ ఉన్న భారతీయ-అమెరికన్లను రక్షించేందుకు భారత దౌత్యకార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. ప్రజలను రక్షించేందుకు మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని యూఎస్‌లో భారత రాయమారి నవతేజ్ సర్నా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.