Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ను తొలిసారిగా చైనా ప్రదర్శనకు ఉంచింది. టియాంజిన్ సిటీలో జరుగుతున్న హెలికాప్టర్ ఎక్స్‌పోలో ఈ మానవరహిత యుద్ధ హెలికాప్టర్ ఏవీ500డబ్యూను ఏవియేషన్ ఇండిస్టీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) ప్రదర్శనకు ఉంచింది. 7.2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను జియాంగ్సి ప్రావిన్స్‌లోని ఏవీఐసీకి చెందిన హెలికాప్టర్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ తయారు చేసింది. ఇది గరిష్ఠంగా 450 కిలోల బరువు మోస్తూ గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
ఈ హెలికాప్టర్‌కు 120 కిలోల ఆయుధాలు, సామాగ్రిని రవాణా చేయగల సామర్థ్యం ఉంది. ఆకాశంలో ఎనిమిది గంటల పాటు ఎగురుతూ నిఘా చేపట్టగలదు. యుద్ధం సమయంలో నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎగిరే సామర్థ్యం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోకి త్వరలోనే ఈ మానవరహిత యుద్ధ హెలికాప్టర్‌ను తీసుకొచ్చేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
'ఎలాంటి కఠిన, ప్రతికూల ప్రదేశాల్లోనైనా ఈ హెలికాప్టర్‌ను ల్యాండ్/టేకాఫ్ చేయొచ్చు. సరిహద్దులో పెట్రోలింగ్ నిర్వహించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని ఏవీ500డబ్ల్యూ డిజైనర్లలో ఒకరైన జియాంగ్ తైయు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విజయవంతంగా ప్రయోగించి.. 2018 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.