Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హవానాలో దౌత్య కార్యాలయం మూసివేయాలన్న ఆలోచనలో అమెరికా !
వాషింగ్టన్ : క్యూబా-అమెరికా దౌత్య సంబంధాలు మళ్లీ మొదటికి వచ్చేలా పరిస్థితులు కనబడుతున్నాయి. హవానాలో అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ మీడియాకు తెలియజేశారు. అక్కడి దౌత్యకార్యాలయ సిబ్బంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని, వారిపై ధ్వనితరంగాలతో దాడి జరిగిందని ట్రంప్ సర్కార్ అనుమానిస్తున్నది. దౌత్య సిబ్బంది అనారోగ్యం పాలవటానికి కారణం క్యూబాయేనని అమెరికా ఆరోపణలు చేస్తున్నది. అయితే ఈ ఆరోపణల్ని క్యూబా ఖండించింది. అమెరికా చేపట్టే విచారణకు పూర్తిగా సహకరిస్తామని క్యూబా ప్రకటించింది. అమెరికా దౌత్యకార్యాలయం ఉన్న భవనంలోనే కెనడా దౌత్య అధికారులు కూడా పనిచేస్తున్నారు. మెదడు సంబంధిత సమస్యలతో ఇద్దరు కెనడా దౌత్య అధికారులు కూడా హాస్పిటల్ పాలయ్యారు. అయితే తమ సిబ్బందిపై ధ్వనితరంగాలతో దాడి జరిగిందన్న ఆరోపణలు కెనడా చేయటం లేదు. హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయంలో మొత్తం 21 మంది అధికారులు పనిచేస్తున్నారు. వీరందరిలో కూడా మెదడు సంబంధిత సమస్యలు తలెత్తటంపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ధ్వని తరంగాలతో వారిపై దాడులు చేసి ఉంటారని ఆరోపణలు చేసింది. దీనికి ప్రతీకారంగా కొద్ది నెలల క్రితం వాషింగ్టన్లోని క్యూబా దౌత్యకార్యాలయం నుండి ఇద్దరు ఉన్నతాధికారుల్ని అమెరికా బహిష్కరించింది.