Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుఫాన్లో చిక్కుకుపోయాం : డొమినికా ప్రధాని ఫేస్బుక్లో సందేశం
మెక్సికో సిటీ : కరేబియన్ దీవులపై తాజాగా మరో తుఫాన్ 'మారియా' విరుచుకుపడుతున్నది. మంగళవారంనాడు డొమినికా తీరాన్ని తుఫాన్ తాకినట్టు అమెరికా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ ధాటికి తన ఇంటి పై కప్పు ఎగిరిపోయిందని డొమినికా ప్రధానమంత్రి రూసెవెల్ట్ స్కెరిట్ట్ ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన 'ఇర్మా' తుఫాన్ దెబ్బకు కరేబియన్ దేశాలు విలవిలలాడాయి.
'మారియా' తుఫాన్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు డొమినికా ప్రధాని స్కెరిట్ట్ సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నారు. 'మా ఇల్లు వరదల్లో చిక్కుకుంది. పెనుగాలులు వీస్తున్నాయి. దేవుడే మమ్మల్ని కాపాడాలి. మా ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. తుఫాన్లో మేమందరం చిక్కుకున్నాం.' అని ఆయన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ పోస్టు చేసిన కొద్ది గంటల తర్వాత ఆయనను అధికారులు రక్షించారు. ఈ విషయాన్ని కూడా ఆయన ఫేస్బుక్ ద్వారానే తెలియజేశారు. తొలుత మారియా తుఫాన్ కేటగిరి-1లో ఉండగా, ఇప్పుడు ఇది కేటగిరీ-5గా మారింది. దీని ప్రభావం కారణంగా గంటకు 260కి.మీ వేగంతో ప్రచండగాలులు వీచే అవకాశం ఉంది. ఇర్మా నుంచి కరేబియన్ దీవులు కోలుకోకముందే మారియా వచ్చి పడిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్తగా ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.