Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహజవాయువు, చమురు ఉత్పత్తుల ఎగుమతలపై పూర్తి నిషేధం
- టెక్స్టైల్స్ దిగుమతలు ఉండవు : చైనా వాణిజ్యమంత్రిత్వ శాఖ ప్రకటన
బీజింగ్: క్షిపణి ప్రయోగాలు, అణుపరీక్షల కారణంగా ఉ.కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐరాస భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు సభ్యదేశాలన్నీ అమలుజేయడానికి సన్నద్ధమ వుతున్నాయి. ఆంక్షల విషయమై తాజాగా చైనా తన నిర్ణయాన్ని వెలువరించింది. ఉ.కొరియాపై సరికొత్త ఆంక్షల్ని విధించింది. సహజవాయువు, చమురు ఉత్పత్తుల ఎగుమతులపై, టెక్స్టైల్ దిగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తూ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుద్ధిచేసిన చమురు ఎగుమతులపై పరిమితిని విధించింది. ఇది వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నామని చైనా తెలిపింది.
శుద్ధిచేసిన పెట్రోలియం (గ్యాసోలిన్, డీజిల్, నాఫ్తా...మొదలైనవి) ఎగుమతులను ఏడాదికి 2 మిలియన్ బ్యారెల్స్కు పరిమితం చేయనున్నట్టు చైనా తెలిపింది. 2016 ఏడాదిలో ప్రతీ రోజూ చైనా నుంచి 6 వేల బ్యారెళ్ల శుద్దిచేసిన చమురును ఉ.కొరియా దిగుమతి చేసుకున్నది. ఆ ఏడాది మొత్తం 2.2 మిలియన్ బ్యారెళ్ల శుద్ధిచేసిన చమురు ఉ.కొరియాకు దిగుమతి అయ్యింది.
సహజవాయువు ఎగుమతుల్ని చైనా ఇప్పటికే నిలిపివేసింది. అంతేగాక.. ఉత్తరకొరియా నుంచి వస్త్ర దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా తాజా నిర్ణయంతో ఉ.కొరియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తరకొరియాకు చైనా ప్రధాన వ్యాపార భాగస్వామి. దౌత్యపరంగానూ ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించాలని ఐరాసలో తీర్మానం చేశారు. దీనికి చైనా కూడా మద్దతు తెలిపినప్పటికీ.. ఆ దేశంపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రం అడ్డుచెప్పింది.
రూ.4541 కోట్ల విలువైన వస్త్రవ్యాపారంపై దెబ్బ
బొగ్గు, ఇనుము, సముద్ర ఉత్పత్తులు, ఇతర ఖనిజాల ఎగుమతుల ద్వారా ప్రతీ ఏటా ఉ.కొరియా పొందుతున్న ఆదాయం 1 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.6487 కోట్లు). ఆ తర్వాత స్థానం వస్త్రాల ఎగుమతిదే. టెక్స్టైల్స్ ఎగుమతులు ఉ.కొరియాకు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నది. ప్రతీ ఏటా జరిగే ఈ ఎగుమతుల విలువ రూ.4541 కోట్లు. ఈ ఆదాయాన్ని కూడా దెబ్బకొట్టాలని అమెరికా, దాని మిత్రదేశాలు చైనా, రష్యాలపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చాయి. చివరికి కొన్ని పరిమితులకు లోబడి చైనా, రష్యాలు ఒప్పుకోక తప్పలేదు.