Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరియా ద్వీపకల్పం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు సూచన
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ షాకిచ్చారు. ఉత్తరకొరియా వివాదాన్ని తాము పరిష్కరించాలంటే కొరియా ద్వీపకల్పంలో మోహరించిన యూఎస్ బలగాలను వెనక్కి పిలవాలని జిన్‌పింగ్ షరతు పెట్టారు. అంతేగాకుండా, కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను నిలిపివేయాలని కోరారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాల సంయుక్త సైనిక విన్యాసాలతోనే కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు. ఇరు దేశాల సైన్యాలు వెనక్కి వెళ్లినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశముందని అన్నారు. కాగా, కొరియా ద్వీపకల్పంలో యూఎస్ బలగాలు కొంతకాలంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. దక్షిణ కొరియాను ఉత్తరకొరియాపైకీ ఎగదోసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ప్రత్యర్థి ఉత్తరకొరియానే అనే భావాన్ని సృష్టించాయి. కొరియా ద్వీపకల్పంలో అశాంతియుత వాతావరణం సృష్టించాలని కుట్ర పన్నాయి. ఈనేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికే తాము ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అనేక సార్లు ప్రకటించారు. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను నిలిపివేయాలని ఐరాస ఆంక్షలు విధించింది. ఐరాస ఆంక్షలను బేఖాతర్ చేస్తూ కిమ్ క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. కిమ్ చర్యలతో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ దేశాధినేతల కంటిపై కునుకులేకుండా పోయింది. ఓ దశలో ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనలకు కిమ్ ఏమాత్రం తలొగ్గలేదు. దీంతో, రెచ్చిపోయిన ట్రంప్ ఇక ఉత్తరకొరియా విషయంలో ఒకే మార్గం మిగిలి ఉందని ప్రకటించారు. ఉత్తరకొరియాపై సైనిక చర్యలు తప్పవన్నారు. దీనికి అనుగుణంగా అమెరికా సైన్యం, క్షిపణి దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగల 'థాడ్'వ్యవస్థను దక్షిణ కొరియాలో మోహరించాయి. అంతేకాకుండా అమెరికా శక్తి ఏమిటో ఉత్తరకొరియాకు తెలియజేసేలా జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిర్వహించాయి. ఆసియా దేశాలతో ఉత్తరకొరియా సంబంధాలను తెంచేసే ఉద్దేశంతో ఇటీవల ట్రంప్ 13రోజుల పాటు ఆసియా దేశాల్లో పర్యటించారు. ఉత్తరకొరియాకు.. చైనాకు మిత్ర దేశం కావడంతో కిమ్‌కు నచ్చజెప్పమంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కోరారు. ఈ నేపథ్యంలో... ఉత్తరకొరియా ద్వీపకల్పంలో అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి సైనిక, నౌకాదళ విన్యాసాలు నిర్వహించడాన్ని వెంటనే నిలిపేయాలని చైనా హితవు పలికింది. ఆ విన్యాసాల వల్ల కొరియా ద్వీపకల్పంలోని రెండు దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చైనా పేర్కొన్నది. శాంతి కోరుకునే దేశాలు ఇలాంటి పనులు చేయబోవంటూ.. అమెరికా కూడా అలాంటి పని చేయబోదని తాను నమ్ముతున్నామని జిన్‌పింగ్ అన్నారు. ఉద్రిక్తతను తగ్గించే దిశగా.. ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో తిష్టవేసిన అమెరికా సైనికులను కూడా వెనక్కి పంపేయాలని సూచించారు. ఉత్తరకొరియా అణు పరీక్షలు జరపకుండా చూసే బాధ్యత తమపై ఉందని, తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నామని, అందుకే రెండు నెలలుగా ఉత్తరకొరియా కూడా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించలేదని జిన్‌పింగ్ తెలిపారు. అమెరికా నిజంగా శాంతిని కోరుకునే దేశమే అయితే, వెంటనే తన సైనికులను ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల నుంచి ఉపసంహరించుకోవాలంటూ ట్రంప్‌ను ఇరకాటంలోకి నెట్టారు. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
సౌదీ ప్రయత్నాలు భేష్ : జిన్‌పింగ్
దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు సౌదీ చేస్తున్న ప్రయత్నాలు భేష్ అంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కితాబిచ్చారు. ప్రాంతీయ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సౌదీ కృషి చేస్తోందన్నారు. సౌదీ రాజు సల్మాన్ వచ్చే ఏడాది మార్చిలో చైనాలో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో జిన్‌పింగ్, సల్మాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగినట్టు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్నది. ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించినట్టు తెలిపింది. కాగా, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలతో చైనాకు సత్సంబంధాలున్నాయి.
మీ ధన్యవాదాలు జిన్‌పింగ్‌కు చెప్పండి : ట్రంప్
'మీ ధన్యవాదాలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తెలపండి. ఆయన ఆదేశాలతోనే మీరు విడుదలయ్యారు. ఇకపై నీతి,నిజాయితీతో జీవించండి. దొంగతనాలకు పాల్పడటం తప్పు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇలాంటి తప్పు జీవితంలో మరోసారి చేయకండి ' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. చైనాలో ఓ షాపులో చోరీకి పాల్పడ్డ కేసులో ముగ్గురు అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు అరెస్ట్ అయ్యారు. దొంగతనానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు. చైనా న్యాయస్థానం ముగ్గురు దోషులకు 10ఏండ్ల జైలుశిక్ష కూడా విధించింది. ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్...అమెరికాకు చెందిన ముగ్గురు బాస్కెట్ బాల్ క్రీడాకారుల విడుదల గురించి జిన్‌పింగ్‌తో చర్చించారు. దీంతో, సానుకూలంగా స్పందించిన జింగ్పింగ్ వారి విడుదలకు ఆదేశాలిచ్చారు.