Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెనడాలో దారుణం
ఒట్టావా, కెనడా : బురఖా ధరించినందుకు పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిపై దాడి జరిగిన సంఘటన కెనడాలో చోటు చేసుకుంది. టొరంటోలో శుక్రవారం బురఖా వేసుకుని వెళుతున్న విద్యార్థిని (11)పై ఒక వ్యక్తి దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కత్తెరతో ఆమె బురఖా చించివేసేందుకు ఆ వ్యక్తి రెండుసార్లు ప్రయత్నించాడని, ఆ తర్వాత పారిపోయాడని చెప్పారు. తన తమ్ముడితో కలిసి స్కూలుకు వెళుతుండగా ఆ వ్యక్తి కత్తెరతో తన ముఖంపై గల బురఖాను లాగేందుకు యత్నించాడని, తాను చాలా భయపడ్డానని, ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడ్డానని తెలిపింది. తలపై నల్ల టోపీతో, కళ్ళద్దాలతో వున్న ఆ వ్యక్తి ఆసియన్ జాతీయుడని, దాదాపు ఆరడుగులు వున్నాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి అంతలా మీదకు వస్తున్నా ఒక్కరు కూడా అడ్డగించడానికి ముందుకు రాలేదని కానిస్టేబుల్ జెనిఫర్జిత్ సిదూ పత్రికా సమావేశంలో తెలిపారు. ఆ బాలిక తన తమ్ముడితో కలిసి అరుస్తూ అక్కడ నుండి పారిపోయిందన్నారు. మొదటిసారి దాడి జరిగిన పది నిముషాల తర్వాత మరోసారి ఆ వ్యక్తి మళ్ళీ అదే విధంగా దాడికి యత్నించాడు. ఇది పిరికిపంద చర్య తప్ప మరొకటి కాదని ఓంటారియో ప్రధాని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.