Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో గిటా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ ఆస్తినష్టం జరిగింది. తుఫాను దృష్ట్యా అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీధుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. తుఫాను తాకిడితో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో వేలాది మంది ఇబ్బందిపడుతున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. విమాన సర్వీసులను పాక్షికంగా నిలిపివేసినట్టు వెల్లింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. క్రిస్ట్‌చర్చ్, బుల్లర్, గ్రే డిస్ట్రిక్ట్స్, సెల్విన్, వెట్స్లాండ్, తస్మాన్, తారనాకీ ప్రావిన్స్‌ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. కైకోరా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.