Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భూమిపై క్రమంగా వనరులన్నీ అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానవుడి కన్ను ఇతర గ్రహాలపై పడింది. మన ఉపగ్రహమైన చంద్రుడిని మొదలుకొని సౌరకుటుంబం చివర్లో ఉన్న మరగుజ్జు గ్రహం ప్లూటో వరకూ ఖగోళ శాస్త్రవేత్తలు దేనినీ వదలడం లేదు. ఇప్పుడు నాసా ఓ ప్రతిష్టాత్మక మిషన్ చేపట్టింది. భూమికి అతి సమీపంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్‌పై ఉన్న ఖనిజాలను మైనింగ్ చేయడమే ఆ ప్రాజెక్ట్ లక్ష్యం. నాసాకు 2016లో ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ నుంచి లాంచ్ చేసిన ఒసిరిస్-రెక్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇది ఇప్పటికే 130 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సూర్యుడి చుట్టూ తిరిగి భూమికి దగ్గర ఉన్న బెన్ను అనే ఆస్టరాయిడ్ దగ్గరికి ఇది రానుంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఒసిరిస్-రెక్స్ బెన్నుకు సంబంధించిన తొలి ఫొటోలను అందించనుంది. ఏడాది పాటు ఆ ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగుతూ.. దానికి సంబంధించిన ఫొటోలను సేకరించి పూర్తిగా అధ్యయనం చేయనుంది.
2020, జులైలో ఒసిరిస్-రెక్స్ బెన్ను ఆస్టరాయిడ్ ఉపరితలంపైకి చేరి మూడు శాంపిల్స్‌ను సేకరిస్తుంది. నాలుగేండ్ల పాటు అంతరిక్షంలో ఉన్న ఈ స్పేస్‌క్రాఫ్ట్.. కొన్ని సెకన్లలో ఆస్టరాయిడ్ ఉపరితలంపై శాంపిల్స్‌ను సేకరించి తిరుగు ప్రయాణమవుతుంది. ఈ బెన్ను ఆస్టరాయిడ్ ప్రతి ఆరేండ్లకోసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇలాంటి ఆస్టరాయిడ్స్ పది శాతం ఇనుము, నికెల్‌తో ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఇక బెన్నుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒసిరిస్-రెక్స్ సేకరించిన తర్వాత దానిని శాస్త్రవేత్తలు విశ్లేషించి.. ఇది భవిష్యత్తులో భూమిని ఢకొీనే ప్రమాదం ఉందా లేదా అనే అంశంపై అధ్యయనం చేపట్టనున్నారు. ఒసిరిస్-రెక్స్ 2021 మార్చిలో భూమికి తిరుగు ప్రయాణమవుతుంది. 2023, సెప్టెంబర్‌లో భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో అది సేకరించిన శాంపిల్స్‌ను కిందికి వదిలేస్తుంది. రాకెట్ ఇంధనం కోసం ఆస్టరాయిడ్లనే పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు నమ్ముకున్నారు. దీనివల్ల ఆస్ట్రోనాట్లు, స్పేస్‌క్రాఫ్ట్‌లు ఎక్కువకాలం కక్షలో ఉండే వీలు కలుగుతుంది. రిచర్డ్ బ్రాన్సన్లాంటి బడా పారిశ్రామికవేత్తలు ఆస్టరాయిడ్లపై మైనింగ్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మన సౌరకుటుంబంలో కోట్ల కొద్దీ ఆస్టరాయిడ్స్ ఉన్నాయి. ఈ ఆస్టరాయిడ్స్‌పై అత్యంత విలువ చేసే ఖనిజాలు ఉన్నాయి. మన ప్రపంచం మొత్తం జీడీపీ 80 లక్షల కోట్ల డాలర్లు. ఆస్టరాయిడ్లపై ఉన్న ఖనిజాల విలువ దీనికి 192283 రెట్లు ఎక్కువగా ఉంటుంది.