Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన
వాషింగ్టన్ : అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై భారీ సుంకం విధించినట్టు అమెరికా ప్రకటించింది. అల్యూమినియంపై 25శాతం, ఉక్కుపై 10శాతం పెంచడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. దాదాపు 4 లక్షల కోట్ల చైనా ఉత్పత్తులపై కూడా భారీగా పన్ను పోటు విధించేందుకు అధ్యక్షుడు ప్రతిపాదించినట్టు వైట్‌హౌస్ కార్యాలయం ప్రకటించింది. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలను లక్ష్యంగా చేసుకుని, 60 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ యోచిస్తున్నట్టు వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ట్రేడ్ యాక్ట్, 1974కు అనుగుణంగా మేథో సంపత్తి విచారణ సెక్షన్ 301తో ఈ టారిఫ్‌లు అనుబంధంగా మారుతాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాలను టార్గెట్‌గా చేసుకుని, ఈ టారిఫ్‌లను విధించబోతున్నారని పేర్కొన్నారు. సినో-యూఎస్ వాణిజ్య సంబంధాలు జీరో-సమ్ గేమ్ లాంటివి కావని, ఆందోళనలను సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్మాణాత్మక మార్గాలను రెండు దేశాలు అనుకరించాలని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు. చైనా ప్రయోజనాలకు హాని కలిగేలా అమెరికా చర్యలు తీసుకుంటే, చైనా కూడా తమ చట్టబద్ధమైన హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకుంటుందన్నారు. చైనాను శిక్షించడానికి తన పెట్టుబడుల పాలసీలతో ట్రంప్ చైనీస్ హై టెక్నాలజీ కంపెనీలను ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలిసింది. జాతీయ భద్రతా ఆంక్షల కింద చైనీస్ కంపెనీలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుబడుల నిబంధనలను విధించాలని భావిస్తోంది. ట్రంప్ టారిఫ్ ప్లాన్‌లో కార్మికులతో ముడిపడి ఉన్న కన్జ్యూమర్ రంగం ఉంది. దీనిపై వాషింగ్టన్ లాబియిస్ట్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సరిహద్దు గోడ నిర్మాణ పనులను పరిశీలించిన ట్రంప్
అమెరికా - మెక్సికో సరిహద్దు ప్రాంతాలలో నిర్మిస్తున్న సరిహద్దు గోడ పనులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పరిశీలించారు. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవటానికి నిరాకరిస్తున్న కాలిఫోర్నియా ప్రభుత్వం మొత్తం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కాలిఫోర్నియాకు వచ్చిన ట్రంప్‌కు ఈ సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ప్రదర్శనలు చేస్తున్న స్థానికులు ఆయనకు నిరసనలతో స్వాగతం పలికారు. అక్రమ వలసదారులపై చర్యల విషయంలో ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్న సమయంలో ట్రంప్ ఇక్కడికి రావటం గమనార్హం.
ట్రంప్ వ్యతిరేక నిరసనలు
బివర్లీ హిల్స్ పార్క్ ప్రాంత స్థానికులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వలసదారులను స్వాగతిస్తామని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శాన్‌డియాగోలోని శాన్ ఇసిడ్రో పోర్ట్‌లోనూ ఆయనకు నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ఎవరిపైనా నిషేధం వద్దు, సరిహద్దుల్లో గోడ వద్దు అంటూ వారు నినాదాలు చేశారు. మెక్సికో సమీపంలోని టిజువానాలో కూడా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి.