Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం
- ఉపాధ్యక్షుడిగా వాంగ్ క్విషాన్ ఎంపిక
బీజింగ్: రెండోపర్యాయం చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ ఎంపికకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయన శనివారంనాడు బీజింగ్‌లోని 'గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్' (పార్లమెంట్)లో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లోని 2970 మంది సభ్యులు అధ్యక్షుడిగా ఆయన ఎంపికకు అంగీకారం తెలిపారు. జిన్‌పింగ్ సన్నిహితుడిగా పేరు ఉన్న వాంగ్ క్విషాన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దీనిపై పార్లమెంట్ ఓటింగ్‌లో కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేశాడు.
దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్ అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. చైనా పూర్తి సైన్యానికి హైకమాండ్‌గా వ్యవహరించే అత్యంత శక్తివంతమైన 'సెంట్రల్ మిలిటరీ కమిషన్' అధినేతగా జిన్‌పింగ్ ఎంపికకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్ నేతృత్వంలో నేడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ప్రధాని లీ క్వెకియాంగ్ మినహా మినహా ఉన్నత స్థాయి అధికారులను, మంత్రిమండలిని, అక్కడి సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌ను మార్చేయనున్నారు.
చైనాలోని అధికార కమ్యూనిస్ట్ నేషనల్ పార్టీ అధ్యక్షుడి, ఉపాధ్యక్షుడి పదవీకాల పరిమితిని ఎత్తేస్తూ ప్రతిపాదించిన చట్ట సవరణను మార్చి 11న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు చెందిన 2900మంది డిప్యూటీలంతా కలిసి ఆమోదించారు. రెండు పర్యాయాల కాల పరిమితి ప్రకారం జిన్‌పింగ్ 2023నాటికి కమ్యూనిస్ట్ నేషనల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉండేది. ఆయన 2013లో అధ్యక్షుడు అయ్యారు. జిన్‌పింగ్ ప్రవేశపెట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమం వాంగ్ క్విషాన్ ఆధ్వర్యంలో జరుగుతోంది.