Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దేశంతో అమెరికా సంబంధాలపై చైనా ఆగ్రహం
బీజింగ్ : తైవాన్-అమెరికా సరికొత్త సంబంధాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'తైవాన్ ట్రావెల్ యాక్ట్'పై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తైవాన్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త నిబంధనలకు ట్రంప్ ఆమోదం తెలిపినట్టైంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఉన్నతస్థాయి అమెరికా దౌత్యవేత్తల బృందం ఒకటి తైవాన్ పర్యటనకు బయల్దేరనున్నది. అనధికారికంగా ఇరు దేశాల ఉన్నతాధికారుల రాకపోకలు సాగుతన్నప్పటికీ, ఇకపై ఇవన్నీ అధికారికంగా జరగబోతున్నాయి. తద్వారా తైవాన్‌కు ఒక సార్వభౌమికదేశ గుర్తింపు ఇవ్వాలని అమెరికా పావులు కదుపుతోంది.
'వన్ చైనా పాలసీ' ప్రకారం, ఈ ఒప్పందానికి కట్టుబడి చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగివున్న దేశాలు తైవాన్ను ఒక సార్వభౌమిక దేశంగా గుర్తించడానికి వీల్లేదు. చైనాపై తీవ్ర వ్యతిరేకత కలిగివున్న డొనాల్డ్ ట్రంప్, తైవాన్ అంశాన్ని అడ్డుపెట్టుకొని చైనాను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అమెరికా తాజా నిర్ణయాలపై చైనా నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇవ్వటం చాలా పెద్ద తప్పు అని...దీనిని సరిదిద్దుకోవాలని, తైవాన్‌తో సంబంధాలు ఏర్పర్చుకోవటమంటే, చైనా అంతర్గత సంబంధాల్లో కలుగజేసుకోవటమేనని చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది.