Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం
- పుతిన్‌కు 76శాతం ఓట్లు
మాస్కో : రష్యా రాజకీయాల్లో తిరుగులేనినేతగా పుతిన్ మరోమారు నిరూపించుకున్నారు. ఆదివారం నాటి అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌లో ఆయనకు 5.6కోట్ల మంది (76శాతం) మద్దతుగా ఓటేశారు. దీంతో రష్యా అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు.
గత 18 ఏండ్లుగా అధ్యక్ష పీఠంపై ఉన్న ఆయన్నే మళ్లీ ప్రజలు ఎన్నుకోవటం బ్రిటన్, అమెరికా మిత్ర దేశాలకు మింగుడుపడని అంశం. ఇప్పటివరకు 70 శాతం ఓట్లు లెక్కించగా, ఇందులో పుతిన్ 76 శాతం ఓట్లు సాధించినట్టు సెంట్రల్ ఎన్నికల కమిషన్ సోమవారం తెలిపింది. దీంతో వరుసగా ఆయన నాలుగోసారి గెలిచి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ విజయంతో మరో ఆరేండ్లపాటు..అంటే 2024 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు.
గతంలో సోవియట్ యూనియన్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ మాత్రమే అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ ఎన్నికల విజయంతో స్టాలిన్ తర్వాత దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన నాయకుడిగా పుతిన్ గుర్తింపు అందుకున్నాడు. మొత్తం 10.70 కోట్ల మంది ఓటర్లలో మెజార్టీ ప్రజలు మళ్లీ ఆయన్నే కోరుకున్నట్టుగా ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌తోపాటు ఏడుగురు పోటీపడగా, న్యాయపరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ ముందే తప్పుకున్న విషయం తెలిసిందే.
జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యం : పుతిన్
పశ్చిమ దేశాలకు దీటుగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని, ప్రజల జీవనప్రమాణాలను పెంచడానికి కృషిచేస్తానని ఎన్నికల ప్రచారంలో పుతిన్ వాగ్దానం చేశారు. ఈ విజయంపై పుతిన్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో తనపై విశ్వాసం ఉంచి ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. క్లిష్టసమయంలో తనకు మద్దతుగా నిలిచారని, రష్యా పురోగతి సాధించడానికి పనిచేసే మరో అవకాశం దక్కిందని పుతిన్ వ్యాఖ్యానించారు. తుది సమాచారం మేరకు ఈ ఎన్నికల్లో పుతిన్ 76 శాతం ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ నేత పావెల్ గ్రుడినిన్ 13 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని 'సెంట్రల్ ఎన్నికల కమిషన్' సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.