Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైపీడా: మయన్మార్ అధ్యక్షుడు హతిన్ క్యా తన పదవికి రాజీనామా చేశారు. మయన్మార్‌కు చెందిన ప్రముఖ నాయకురాలు, హక్కుల నేత ఆంగ్ సాన్ సూకీకి కుడి భుజంగా ఉన్న హతిన్ తన పదవి నుంచి వైదొలిగారు. హతిన్ రాజీనామా చేసినట్టు మయన్మార్ అధ్యక్ష కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన హతిన్ క్యా రెండేండ్ల కంటే తక్కువ సమయం పదవిలో ఉన్నారు. అయితే, విశ్రాంతి కోసమే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు హతిన్ తెలిపారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని గతేడాది నుంచి మీడియాలో పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. కానీ వాటిని పార్టీ ఖండిస్తూ వచ్చింది. గతంలో ఆయన పలుమార్లు అనారోగ్య కారణాలతో విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల జనవరిలో కూడా సింగపూర్‌లో చికిత్స పొందారు. ఉపాధ్యక్షుడు యు మైయింట్ స్వే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు అంగ్‌సాన్ సూకీనే అధ్యక్షురాలు అవుతారని అందరూ భావించారు. కానీ, ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తనకు అత్యంత విధేయుడైన హితేన్కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్ కౌన్సిలర్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. అయితే, మయన్మార్ బలగాలు రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోసినప్పటికీ సూకీ ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఈ విషయంలో అంగ్‌సాన్ సూకీ, హితేన్ ఇతర దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.