Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ నుంచి మరొకరిని తొలగించారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మెక్‌మాస్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో ఐరాస మాజీ రాయబారి జాన్ బోల్టన్‌ను నియమించారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీ నేతలు సైతం నిర్ఘాంతపోతున్నారు. గతవారమే అమెరికా విదేశాంగ మంత్రి పదవి నుంచి రెక్స్ టిల్లర్సన్ను తొలగించి ఆ స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపియోను నియమించిన సంగతి తెలిసిందే. ట్రంప్ యంత్రాంగం నుంచి పలువురు ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటికే తప్పుకున్నారు. తాజాగా మరొకరు ఆ జాబితాలో చేరారు. మెక్‌మాస్టర్‌ను పదవి నుంచి తొలగించనున్నట్టు గత వారమే వార్తలు వెలువడ్డాయి. అయితే, వైట్‌హౌస్ ఆ వార్తలను ఖండించింది. తన నూతన జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఏప్రిల్ 9 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మెక్‌మాస్టర్ సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఎప్పటికీ తన స్నేహితుడిగా ఉంటారని పేర్కొన్నారు.
ట్రంప్ తన యంత్రాంగం నుంచి తొలగించిన రెండో జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్. గత ఏడాది మైఖేల్ ఫ్లైన్ను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి తొలగించారు. వైట్‌హౌస్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన విభాగం. జాతీయ భద్రతకు సంబంధించిన అజెండా దీని చేతిలోనే ఉంటుంది.
వివాదాలకు కేరాఫ్ బోల్టన్
బోల్టన్ (69)కు పరిపాలనా పరంగా అపార అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రొనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్డబ్ల్యు బుష్, జార్జ్ డబ్ల్యు బుష్ అమెరికా దేశాధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో పనిచేశారు. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐరాస రాయబారిగా పనిచేశారు. సద్దామ్ హుస్సేన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని తప్పుడు నివేదిక ఇచ్చింది బోల్టనే. అనంతరం బోల్టన్ నివేదిక కుట్రపూరితమైందని తేలడంతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇరాక్‌పై అమెరికా దురాక్రమణకు పాల్పడటంలో బోల్టన్ తనదైన పాత్ర పోషించారు. ఉత్తరకొరియాను విమర్శిస్తూ బోల్టన్ ఓ పత్రికలో కథనాలు రాస్తున్నారని, ఉత్తరకొరియాపై అమెరికాను ఎగదోస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.