Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో ట్రంప్సర్కారు నిర్ణయం
- ఆదేశాలు నిలువరించే ప్రయత్నాల్లో ప్రమీలాజైపాల్
అమెరికాలో హెచ్-4 వీసాల రద్దుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను నిలువరించేందుకు ఇండో అమెరికన్ శాసనకర్త ప్రమీలా జైపాల్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న కృషి ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. అమెరికాలోని అన్ని ఉద్యోగాలు అమెరికన్లకే చెందాలనే నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అమెరికా సెనేట్ హెచ్-4 వీసా రద్దుకు సిఫారసు చేసింది. ప్రస్తుతం భారత్కు చెందిన హెచ్1బీ ఉద్యోగులే అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ చైనా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉండేవారు. అయితే హెచ్1బీ ఉద్యోగుల భార్యగాని, భర్తగాని ఉద్యోగం చేసుకునేందుకు ప్రభుత్వం హెచ్-4 వీసా మంజూరు చేస్తుంది. ఆ వీసాపై భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానం ఇక్కడ అమల్లో ఉన్నది. అమెరికాలో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉన్నది. అనేక మంది ఉద్యోగులు అద్దె ఇండ్లలో నివసించడం భారమై, బ్యాంకు రుణాలపై సొంత ఇండ్లు కొనుగోలు చేశారు. భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే గాని సాధారణ జీవితం గడపడం కష్టం. ప్రస్తుతం ఇక్కడ 70 వేల మంది హెచ్-4 వీసాపై పని చేసేవారున్నారు. ఒక వేళ హెచ్-4 వీసా రద్దయితే వారంతా ఖాళీగా ఉండాలి. ఉపాధి కోల్పోతారు. హెచ్-4 వీసాల్లో 93 శాతం మహిళ ఉద్యోగులకు, మిగిలిన 7 శాతం పురుషులకు మంజూరు చేశారు. మరో వైపు హెచ్1బీ వీసాపై పని చేస్తున్న ఉద్యోగులకు వీసా పొడిగింపును కూడా ఇక్కడ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. సాధారణంగా హెచ్1బీ వీసాను మూడేండ్ల కాలానికి జారీ చేస్తారు. ఉద్యోగి లేదా ఆయన పని చేస్తున్న సంస్థ విజ్ఞప్తిపై మరో మూడేండ్లు హెచ్1బీ వీసా గడువును పొడిగిస్తారు. కానీ ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొడిగింపు లభించడం లేదు. అలాంటి వారు ఇంటి దారి పడుతున్నారు. మొత్తానికి విదేశీ ఉద్యోగుల సంఖ్యను అమెరికా ప్రభుత్వం తగ్గిస్తున్నది. దీంతో వీసా నిబంధనలను కూడా కఠిన తరం చేసింది. కొత్తగా హెచ్1బీ వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 2016 సంవత్సరంతో పోలిస్తే 2017లో 4.1శాతం తగ్గిందని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. తొలిసారి హెచ్1బీ వీసా పొందిన భారతీయులు 2016లో 70,737 మంది ఉద్యోగులు ఉండగా, 2017లో ఆ సంఖ్య 67,815కు తగ్గింది. ఇదిలా ఉండగా అమెరికాలో హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు హెచ్ 4 వీసాపై పని అనుమతి పొందే విధానాన్ని తొలగించవద్దని అమెరికాలోని 130 మంది కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ఇండో అమెరికన్ శాసన కర్త అయిన ప్రమీలా జైపాల్ ట్రంప్ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఆ పత్రంపై 130 మంది కాంగ్రెస్ సభ్యులు సంతకాలు చేశారు. హెచ్1బీ వీసాపై పని చేస్తున్న ఉద్యోగుల భాగస్వాములకు పని అనుమతి ఉంచాలని, ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ విధానంతో లబ్ది పొందుతున్నారని ప్రమీలా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల అమెరికన్ సెక్రటరీ ఆఫ్ హౌంల్యాండ్ సెక్యూరిటీ అధికారికి ఈ వినతి పత్రం అందజేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్ 4 వీసాతో పని అనుమతి కల్పించారు. హెచ్ 4 వీసా రద్దు చేస్తే ఆ ప్రభావం 70 వేల కుటుంబాలపై పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాము ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. కాగా అమెరికాలో హెచ్ 4 స్పౌస్ వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికా సంస్థ సీఆర్ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో 5 శాతం కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియోలో పని చేస్తున్నారు. టెక్సాస్, న్యూజెర్సీలో మరో 20 శాతం మంది పని చేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం అమెరికాలో 63 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే నిపుణులైన ఉద్యోగులు లభించడం లేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచేందుకు కంపెనీలు శిక్షణ కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తమకు తలకు మించిన భారమని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు లభించడం లేదని మన యువతీ యువకులు ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళుతున్న విషయం తెలిసిందే. అమెరికాకు ఉద్యోగుల వలస 1980 నుంచే ప్రారంభమైంది. ఇప్పటికీ 38 సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి. మన ఉద్యోగులు అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అందువల్లే సత్యనాదెళ్ల, సుందర్పిచాయి లాంటి నైపుణ్యం గల ఉద్యోగులు వివిధ సంస్థల్లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అందువల్ల అమెరికా ప్రభుత్వం హెచ్-4 వీసా రద్దు ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది.
- అమెరికా నుంచి జి.గంగాధర్ సిర్ప, వాట్సాప్ 8919668843