Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబా విమాన ప్రమాద ఘటన
హవానా : క్యూబాలో ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య వందకుపైగా ఉండే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో వంద మందికి పైగా మరణించగా ముగ్గురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. క్యూబన్ స్టేట్ ఎయిర్వేస్కు చెందిన విమానం 110 మంది ప్రయాణికులతో హవానాలోని జోన్ మార్టి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. హోల్గున్ చేరుకోవాల్సిన విమానం బోరురోస్, శాంటియాగో డీ లావెగాస్ గ్రామాల మధ్య పొలాల్లో పడిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమపడి విమానం నుంచి తీవ్ర గాయాలపాలైన నలుగురు వ్యక్తులను బయటకు తీయగలిగారు. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముగ్గురూ మహిళలు ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక టీవీ ఛానెల్ తెలిపింది. విమానంలో అయిదుగురు చిన్నారులు, అందులోనూ ఒకరు రెండేళ్ల లోపు వయసున్న చిన్నారి ఉన్నట్టు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-200 విమానం 38ఏండ్ల క్రితం తయారైందని అధికారులు తెలిపారు.