Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనిజులా అధ్యక్షుడిగా మదురో ఘన విజయం
కారకస్ : వెనిజులా అధ్యక్షుడిగా నికొలస్ మదురో ఘన విజయం సాధించారు. దీంతో, ఆయన మరో ఆరేండ్ల పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే కారకస్‌లోని అధ్యక్ష భవనం ఎదుట సమావేశమైన ప్రజలను ఉద్దేశించి మదురో మాట్లాడారు. తన విజయానికి ప్రజలిచ్చిన మద్దతు చరిత్రాత్మకం అని అభివర్ణించారు. గతంలో ఎన్నడూ కూడా అధ్యక్ష అభ్యర్థికి 68శాతం ఓట్లు నమోదుకాలేదని అన్నారు. 'మరోసారి మనం విజయం సాధించాం. చరిత్రను శాశ్వత ప్రజా విజయంగా మార్చాం' అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారిక గణాంకాల ప్రకారం మదురోకు 58లక్షల ఓట్లు (67.7శాతం) నమోదు కాగా, ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు కేవలం 18లక్షల ఓట్లు (21.2శాతం ) మాత్రమే నమోదై ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికలో 86 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌కు ముందు జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో మదురో, ఫాల్కన్ల మధ్య పోటాపోటీ ఉంటుందని వెల్లడైంది. ఎవాంగలిస్ట్ బోధకుడు జేవియర్ బెర్టూకికి కేవలం 11శాతం ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన కూడా కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికను ఇక్కడి ప్రతిపక్షం బహిష్కరించింది. తాజాగా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ ఫలితాలను తిరస్కరిస్తూ మరోసారి అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. అమెరికా కూడా వెనిజులా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నది.
బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడి స్థాయికి ఎదిగినా మహానేత మదురో
వెనిజులా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా' సారథి నికోలస్ మదురోకు 55 ఏండ్లు. ఆయన ఒకప్పుడు బస్ డ్రైవర్‌గా పనిచేశారు. కార్మిక సంఘాల బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. ట్రేడ్ యూనియన్ కార్య కలాపాల్లో చాలాకాలం చురుగ్గా పాల్గొన్నారు. హ్యూగో చావెజ్ ప్రభుత్వంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 మార్చి 5న చావెజ్ మృతిచెందినప్పుడు మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన పాలనలో చావెజ్ విధానాలను కొనసాగించారు. దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టారు.
మరోసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి : ఫాల్కన్ డిమాండ్
మదురో ఎన్నికైనట్టు తెలిసిన వెంటనే ఫాల్కన్ స్పందిస్తూ.. ''ఈ ఎన్నికను మేం గుర్తించడం లేదు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి' అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఆహార వస్తువులు పొందడానికి జారీ చేసే కార్డులను అడ్డం పెట్టుకుని మదురోకు అనుకూలంగా ఆయన మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఫాల్కన్ ఆరోపించారు.
మూడు సార్లు వాయిదాపడ్డ ఎన్నికలు : వెనిజులా అధ్యక్ష ఎన్నికలు మూడు సార్లు వాయిదా పడ్డాయి. గతేడాది డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు ప్రతిపక్ష నేత ఒత్తిడితో తొలుత వాయిదాపడ్డాయి. అనంతరం ఈఏడాది ఏప్రిల్22న నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నప్పటికీ నిర్వహించలేకపోయింది. ఈనెల20న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష నేత హెన్రీ ఫాల్కన్, మదురో మధ్యే ఊహించినట్టుగా పోటీ కొనసాగింది.