Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా సైన్యంలో అంతరిక్ష దళం ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ రక్షణశాఖను అదేశించారు. స్పేస్ ఫోర్స్ ఏర్పాటుతో దేశ భద్రత పెరుగుతుందని అన్నారు. 'అంతరిక్షంలో అమెరికా ఉనికి ఒక్కడే ఉంటే సరిపోదు. అక్కడ అమెరికా ఆధిపత్యం కూడా ఉండాలి' అని ట్రంప్ అన్నారు.
అంతరిక్ష సైనిక బలగాన్ని అమెరికా సైన్యంలో ఆరో శాఖగా ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రక్రియను తక్షణం మొదలుపెట్టాలని రక్షణ శాఖను, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను ఆయన ఆదేశించారు. అమెరికా సైన్యంలో ప్రస్తుతం ఐదు శాఖలు పదాతిదళం, వైమానికదళం, నౌకా దళం, కోస్ట్ గార్డ్, మెరీన్ కోర్ ఉన్నాయి. ఆరో శాఖగా ఏర్పడే అంతరిక్ష సైనిక బలగానికి వైమానిక దళానికి సమానమైన హోదా ఉంటుంది.
అంతరిక్షంలో చైనానో, రష్యానో నాయకత్వం వహించడం తమకు ఆమోదనీయం కాదని ట్రంప్ తెలిపారు. అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత అధునాతన ఆలోచనలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఫెడరల్ సంస్థలను ఆదేశిస్తానని చెప్పారు.
స్పేస్ ఫోర్స్ విధివిధానాలు, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా సైన్యంలో కొత్త శాఖను ఏర్పాటు చేయాలంటే యూఎస్ కాంగ్రెస్ ఓ చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపిస్తామని ట్రంప్ చెప్పారు. అంగారక గ్రహం మీదకు కూడా వ్యోమగాములను పంపుతామన్నారు.
'ఇకపై మా అంతరిక్ష కార్యక్రమంలో- జెండా పాతడం, కాలిముద్రలు వదిలి వెనక్కు రావడం వరకే పరిమితంకాబోం. అక్కడ దీర్ఘకాలం పాటు కార్యకలాపాలు సాగిస్తాం.
మా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటాం. అంగారక యాత్రకు పునాది వేసుకుంటాం' అని ట్రంప్ జాతీయ అంతరిక్ష మండలితో సమావేశానికి ముందు వ్యాఖ్యానించారు.
సంపన్నులకు రాకెట్లపై పెరుగుతోన్న ఆసక్తి...
అంతరిక్ష పరిశ్రమ వాణిజ్యపరంగా వృద్ధి చెందుతోందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తన యంత్రాంగానికి ట్రంప్ నిర్దేశించారు. సంపన్నులకు రాకెట్లపై ఆసక్తి ఎక్కువని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అంతరిక్ష అన్వేషణలో పాల్గొనాలంటూ అమెరికా సంపన్నులకు పిలుపునిచ్చారు. రాకెట్ ప్రయోగ కార్యక్రమాలపై తాము రుసుములు కూడా ఎక్కువగా వసూలు చేయబోమని హామీ ఇచ్చారు. అంగారక యాత్రలో ప్రభుత్వం కన్నా దేశంలోని ప్రయివేటు వ్యక్తులు ముందు నిలిస్తే సంతోషమేనని, అదే జరిగితే ఎంతో ఖ్యాతి కూడా వారి సొంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతరిక్ష యాత్రలు, అంతరిక్ష సైనిక దళం గురించి మాట్లాడేటప్పుడు ట్రంప్ ఉత్సాహంగా కనిపించారని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి టారా మెక్కెల్వీ చెప్పారు. ఆయన అంతరిక్ష సైనిక బలగం ఏర్పాటు గురించి చెబుతున్నప్పుడు అక్కడున్న చాలా మంది ఆశ్చర్యపోయారని తెలిపారు. సైనిక దళం ఏర్పాటు కార్యక్రమానికి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్(జేసీఎస్) చైర్మెన్ జోసెఫ్ డన్ఫర్డ్ సారథ్యం వహిస్తారని అన్నారు.