Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్1బీ వీసా జారీలో తాజాగా మరో నిబంధన
- గడువు పొడగింపు, స్టేటస్ మార్పు తిరస్కరణకు గురైతే..అంతే సంగతి
- నోటీస్ టు అప్పియర్... జారీ అవుతుంది
- విద్యార్థులకు కూడా వర్తింపు !
ముంబై : ట్రంప్ సర్కార్ నుంచి హెచ్1-బీ వీసాదారులకు మరో పిడుగులాంటి వార్త వెలువడింది. ఈ వీసా జారీ నిబంధలను మరింత సంక్లిష్టం చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం.. హెచ్1-బీ వీసా గడువు తీరిపోయిన వారు ఇక అమెరికాలో ఎక్కువ రోజులు కొనసాగలేరు. వారిని దేశ బహిష్కరణ లేదా పునరాగమనంపై నిషేధం విధిస్తారు.
జూన్ 28న అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన పాలసీ మెమొరాండమే ప్రకారం, యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస ్(యూఎస్సీఐఎస్) 'నోటీస్ టు అప్పియర్(ఎన్టీఏ) జారీ చేస్తుంది. ఇది జారీ చేసిన అనంతరం సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్టయితే అతనిపై గరిష్ఠంగా 5 ఏండ్లపాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు.
వీసా పొడగింపులో ఏమాత్రం తేడా వచ్చినా...
వీసా పొడిగింపు తిరస్కరణకు గురైనప్పుడు లేదా వీసా రాకున్నా 240 రోజులు గడువు దాటాక కూడా అమెరికాలో ఉంటే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చే ఈ నోటీసు ప్రకారం కోర్టులో హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియ పూర్తవడానికి సాధారణంగా 180 రోజులు పడు తుంది. ఒకవేళ ఆలస్యంగా దరఖాస్తు చేస్తే.. అది తేలే లోగే వీసా గడువు 240 రోజుల పూర్తవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువు పూర్తయ్యే లోగానే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఒకవేళ గడువు పూర్తయినా దరఖాస్తు వ్యవహారం తేలే వరకు అమెరికాలో ఉంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసా పొడిగింపు దరఖాస్తును అంగీకరిస్తే సరే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ నిబంధనలు చూసిన హెచ్1-బీ వీసాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనలు విద్యార్థులకు కూడా వర్తిస్తాయని తెలియడంతో, అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో కంగారు మొదలైంది.