Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో ఎన్నడూ లేనంతగా రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి
అమెరికా పాలకులే దీనికి కారణం : ట్రంప్
- హెల్సింకీలో ట్రంప్-పుతిన్ మధ్య చారిత్రక భేటి
- వివిధ అంశాలపై రెండు గంటలకుపైగా ఏకాంత చర్చలు
హెల్సింకీ : అమెరికా-రష్యా మధ్య అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశముందని, ఇదొక మంచి ఆరంభమని పుతిన్‌తో భేటీ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో అమెరికా-రష్యా దేశాధినేతల మధ్య సోమవారం చారిత్రక భేటీ జరిగింది. ఇరువురి నేతలు ఏకాంతంగా...తొలిసారి రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు, ఈయూ దేశాలతో వాణిజ్యం, అమెరికా ఆంక్షలు, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం...మొదలైన అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
భేటీకి ముందు మీడియా ప్రశ్నలకు ఇరువురు నేతలు సమాధానమిస్తూ, ''ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో స్తబ్ధత, అంతర్జాతీయంగా నెలకొన్న ఇతర సమస్యలపై తాము మాట్లాడుకుంటున్నామని'' పుతిన్ చెప్పారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, ''అమెరికా-రష్యా కలిసిమెలిసి ముందుకు సాగాలని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అణ్వాయుధాలు ఉన్న రెండు గొప్ప దేశాలు ఇవి. మంచీ, చెడుకు ఇదే కారణమైంది. అయినా రెండు దేశాలు కలిసి ముందుకు సాగడానికి ఎన్నో అవకాశాలు గతంలో వచ్చా యి. కానీ అలా జరగలేదు. ఇరు దేశాల సంబంధాల్లో కొత్త ఆరంభం చోటుచేసుకోవాలి'' అని అన్నారు. సాకర్ ప్రపంచ కప్‌ను రష్యా చాలా అద్భుతంగా నిర్వహించిందని పుతిన్‌ను ట్రంప్ ప్రశంచించారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నుంచి మిలటరీ వరకు, ఆపై క్షిపణుల నుంచి చైనా అంశాలవరకు అన్నిటిపై చర్చిస్తామని ట్రంప్ చెప్పారు. చైనా గురించి కూడా కొద్ది పాటి చర్చలు జరుగుతాయని తమకు జిన్‌పింగ్ ఉమ్మడి మిత్రుడని ట్రంప్ అన్నారు.
అమెరికా పాలకులే అందుకు కారణం..
గతంలో ఎన్నడూలేనంతగా అమెరికా-రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయని, దీనికి కారణం అమెరికా పాలకులేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (భేటీకి ముందు) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నాయకుల పిచ్చితనం, మూర్ఖత్వం వల్ల రష్యాతో సంబంధాలు అధ్వానంగా తయారయ్యాయని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్లో ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ఒక లైక్ కొట్టడం కొసమెరుపు.
''రష్యాతో మా సంబంధాలు అధ్వానంగా ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న అమెరికా పిచ్చితనం, మూర్ఖత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు తప్పులు వెతికే పనిలో పడ్డారు.'' అని ట్రంప్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకు ముందు ట్రంప్, పుతిన్ భేటీపై క్రెమ్లిన్ వర్గాలు స్పందించాయి. ఈ భేటీతో పెనుమార్పులు సంభవిస్తాయని మేము ఆశించడంలేదని పేర్కొన్నాయి. కానీ అమెరికా, రష్యా సంబంధాలు మెరుగుపడటంలో తొలిమెట్టు అవుతాయని భావిస్తున్నట్టు తెలిపాయి. ట్రంప్, పుతిన్‌లకు ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని.. వీరి భేటీ బాగా జరుగుతుందని ఆశిస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. వీరి భేటీకి కచ్చితమైన అజెండా ఏమీ లేదని ఆయన వివరించారు. భేటీ సందర్భంగా వీరిద్దరితోపాటు దుబాసీలు మాత్రమే పాల్గొన్నారు.
అమెరికా తొలి శత్రువు ఈయూ
యూరోపియన్ యూనియన్ అంటేనే డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. కారణాలు ఏంటో తెలియదుగానీ, సందర్భం వచ్చినప్పుడల్లా అటూ ఈయూ నేతలు, ఇటు ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్రవ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అమెరికా తొలిశత్రువు యురోపియన్ యూనియనే..అని ట్రంప్ తాజాగా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై యురోపియన్ యూనియన్ సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. ఫిన్లాండ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీకి ఒకరోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.