Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
- వరదల్లో చిక్కుకున్న వారికోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
వాషింగ్టన్ : అమెరికాలో ఫ్లోరెన్స్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమెరికా తూర్పు తీరంలోని ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకొని 14 మంది మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరికొందరు గల్లంతైనట్టు సమాచారం. ఆచూకీ కనిపించకుండా పోయినవారి కోసం ప్రత్యేక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్యాటగిరీ-1 హరికేన్ శుక్రవారం తీరం దాటిన తర్వాత కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. పలు పట్టణాల్లో ఇప్పటికే 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను నెమ్మదిగా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో మరిన్ని వర్షాలు కురిసి కాలనీలు నీట మునిగే ప్రమాదముంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. తుఫాను కారణంగా ట్రెంట్, నూస్ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్టు వెల్లడించారు. న్యూబెర్న్ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. కాగా, ఫ్లోరెన్స్ హరికేన్ తీవ్రత 'ఉష్ణమండల తుఫాను' స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్ రారు కూపర్ స్పందిస్తూ.. 'ఫ్లోరెన్స్ విధ్వంసం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని అన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఫ్లోరెన్స్ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఫ్లోరెన్స్ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు.
'ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కాకుండా అడుగుల లెక్కన కొలవాల్సి వస్తోంది' అని ఉత్తర కరోలినా గవర్నర్ రారు కూపర్ తెలిపారు. సహాయక కేంద్రాల్లో ఉంటున్న వారు ఎవరూ ఇప్పటికిప్పుడే తిరిగి తమ ఇండ్లకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదని, అన్ని రోడ్లకూ వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కరోలినాలోని ఎనిమిది కౌంటీలను విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో సహాయక చర్యలకు నిధులు మరింతగా లభించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రాంతాలలో అధ్యక్షుడు వచ్చే వారం పర్యటించే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది. ఫ్లోరెన్స్ తుఫాను పరిధి 560 కిలోమీటర్లు.
అది పశ్చిమ ఆఫ్రికా సముద్రం నుంచి ప్రయాణించిన దూరం 6,400 కిలోమీటర్లు. గురువారం ఈ తుఫాను వేగం గంటకు 193 కిలోమీటర్లు. ఆ తర్వాత అది బలహీనపడి శుక్రవారం నాటికి క్యాటగిరీ-3 హరికేన్ నుంచి క్యాటగిరీ 1 స్థాయికి తగ్గింది. కరోలినా ప్రాంతంలోని అతిపెద్ద విద్యుత్ సంస్థ డ్యూక్ ఎనర్జీ చేసిన హెచ్చరిక ప్రకారం దాదాపు 30 లక్షల మంది ప్రజలకు విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతుంది. సేవల పునరుద్ధరణకు కొన్ని వారాల సమయం పట్టవచ్చునని తెలిపింది.