Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ కావెనాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం పట్ల మహిళల ఆగ్రహం
- జస్టిస్ కావెనా పట్ల లైంగిక ఆరోపణలే ప్రధాన కారణం
వాషింగ్టన్ : డెన్వార్ ప్రాంతానికి చెందిన జెస్సికా కాంప్‌బెల్ అనే మహిళ కాన్టెంప్లేషన్ ఆఫ్ జస్టిస్ విగ్రహంపై నిల్చొని నిరసన తెలిపింది. యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కావెనా పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్లో గత కొద్దిరోజులగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కావెనా తమపై లైంగికదాడులకు పాల్పడ్డాడంటూ ముగ్గురు మహిళలు మీడియా ముందుకొచ్చి తమ గోడు వినిపించారు. కావెనాను ఎట్టిపరిస్థితుల్లో యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించొద్దని ట్రంప్‌ను వేడుకున్నారు. అయితే, మహిళల ఆరోపణలను జస్టిస్ కావెనా ఖండించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే కొందరు మహిళలు పనిగట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. జస్టిస్ కావెనా అత్యంత ప్రతిభావంతులని, న్యాయశాస్త్రంలో నిష్ణాతులని ట్రంప్ విశ్వసిస్తున్నారు. జస్టిస్ కావెనాను యూఎస్ న్యాయమూర్తిగా ఎంపిక చేద్దామా ? వద్దా ? అనే అంశంపై యూఎస్ సెనెట్‌లో ఆయన ఓటింగ్ ప్రవేశపెట్టారు. జస్టిస్ కావెనాను సుప్రీంకోర్టుకు పంపాలంటూ 50మంది సెనెటర్లు, పంపొద్దంటూ 48 మంది సెనెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓటింగ్ నమోదు చేశారు. దీంతో, జస్టిస్ కావెనా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం ప్రమాణం చేశారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని, సెనెటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున వాషింగ్టన్ కాపిటల్‌లో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూఎస్ సుప్రీంకోర్టు ముందుకు చేరుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు చేబూని నినదించారు.