- భూతాపం, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధాన్ని ఆవిష్కరించడం భేష్ : రాయల్ స్వీడిష్ అకాడమి స్టాకహేోమ్: వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసిన విలియం నోర్దాస్, పాల్ రోమర్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులు, సాంకేతిక ఆవిష్కరణలను సమ్మిళితం చేస్తూ తీసుకువచ్చిన సిద్ధాంతానికిగానూ వీరికి నోబెల్ పురస్కారం వరించింది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థను ప్రకృతితో, విజ్ఞానంతో ఎలా సమ్మిళితం చేయవచ్చో వివరించే పరిధిని వారి ఆర్థిక విశ్లేషణ విస్తృతం చేసిందని రాయల్ స్వీడిష్ ఆకాడమీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీరికి 90 లక్షల స్వీడిష్ క్రోన్‌లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.7.32 కోట్లు) బహుమతి మొత్తంగా దక్కనున్నాయి. యేల్ వర్శిటీలో ప్రొఫెసర్ అయిన నోర్డాస్, న్యూయార్క్ యూనివర్శిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి చెందిన రోమర్‌లు దీర్ఘకాలిక, నిలకడగల అభివృద్ధిని మనం ఎలా సృష్టించగలమనే అంశానికి సంబంధించిన మౌలిక, కీలక ప్రశ్నలకు సమాధానాలు ఆవిష్కరించారని అకాడమీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం-ఆర్థిక వ్యవస్థల పరస్పర సంబంధాన్ని సూచించే నమూనాను రూపొందించిన తొలి పరిశోధకుడు నోర్దాస్ అని స్వీడిష్ అకాడమీ అభిప్రాయపడింది. న్యూయార్క్ యూనివర్సిటీ అనుబంధ స్టెర్న్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ రోమర్, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల విషయంలో సంస్థలు సుముఖత వ్యక్తం చేయడాన్ని ఆర్థిక శక్తులు ఎలా నియంత్రిస్తాయన్నది వివరించారు. సాంకేతిక ఆవిష్కరణలు, వాతావరణ మార్పుల పర్యవసానాలు, కారణాలపై ప్రాథమికంగా విశ్లేషించడానికి వీరిరువురు అందించిన విశ్లేషణ దోహదపడుతుందని అకాడమీ పేర్కొంది. 1990వ దశకంలో ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్య పరస్పర సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి నోర్డాస్ అని అకాడమీ పేర్కొంది. కాలుష్య కారక వాయువుల వల్ల కలిగే సమస్యలకు అత్యంత సమర్ధవంతమైన పరిష్కారం సార్వజనీనంగా కార్బన్ పన్నులు విధించడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవికి రాజీనామా ఈ ఏడాది ప్రొఫెసర్ రోమర్ ప్రపంచ బ్యాంకులో కీలక పదవి నుంచి వైదొలగి వివాదాస్పదమయ్యారు. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ పదవి చేపట్టిన ఆయన కేవలం 15 నెలల్లోనే రాజీనామా చేశారు. వ్యాపార నిర్వహణ సూచీలో చిలీ ర్యాంకింగ్ విషయంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి లేదు లైంగిక కుంభకోణం నేపథ్యంలో నోబెల్ సాహిత్య బహుమతిని వాయిదా వేశారు. ఈ బహుమతిని ప్రకటించే స్వీడిష్ అకాడమీ బోర్డులోని సభ్యుల్లో కొంతమందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు తలెత్తడంతో బహుమతి ప్రకటనను రద్దు చేశారు. 2018 నోబెల్ విజేతలు వీరే..! నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు - వైద్య శాస్త్రం : జేమ్స్.పి.అలిసన్ (అమెరికా), టసూకు హౌంజో (జపాన్) - భౌతిక శాస్త్రం : అర్థర్ అస్కిన్ (అమెరికా), జెరాడ్ మౌరౌ (ఫ్రాన్స్), డొన్నా స్ట్రిక్ లాండ్ (కెనడా) - రసాయన శాస్త్రం: ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్) - సాహిత్యం : ఈ ఏడాది సాహిత్య రంగంతో నోబెల్ అవార్డును ప్రకటించలేదు. - శాంతి : డెనిస్ ముక్వేజ్ (డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో), నదియా మురాద్ (ఇరాన్) - ఆర్థిక శాస్త్రం : విలియమ్ డీ నోర్డాస్ (అమెరికా), పౌల్ ఎం రోమర్(అమెరికా)