Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్సీఐఎస్ నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసా కలిగిన ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులే ఉన్నారని అమెరికాలోని ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. అమెరికా పౌరుల వలస సేవల విభాగం(యూఎస్సీఐఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం... యూఎస్ అక్టోబరు5 నాటికి 4,19,637 మంది విదేశీయులు హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో 3,09,986 మంది భారతీయులు ఉన్నారని యూఎస్సీఐఎస్ నివేదికలో పేర్కొన్నది. హెచ్-1బీ వీసాదారుల్లో లింగ అసమానత్వం అధికంగా ఉందని యూఎస్సీఐఎస్ తన నివేదికలో తెలిపింది. ప్రతి నలుగురు హెచ్-1బీ వీసాదారుల్లో ఒక మహిళ మాత్రమే ఉన్నారని పేర్కొంది. 4,19,637మంది హెచ్-1బీ వీసాదారుల్లో 1,06,096 (25.3శాతం) మంది మహిళలు, 3,11,997(74.3శాతం) మంది పురుషులు ఉన్నారని తెలిపింది. భారతీయుల్లోనూ లింగ అసమానత్వం అధికంగా ఉందని నివేదిక వెల్లడించింది. అమెరికాలో 3,09,986 మంది భారతీయులు ఉండగా వారిలో కేవలం 63,220 (20.4 శాతం) మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపింది. భారతీయుల తర్వాత స్థానంలో చైనీయులు ఉన్నట్టు యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అయితే భారత్తో పోలిస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. 73.9శాతం మంది భారతీ యులు హెచ్-1బీ వీసాపై ఉండగా, 11.2శాతం మంది మాత్రమే చైనీయులు ఉన్నారు. 47,172 మంది చైనీయులు హెచ్-1బీపై అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే, చైనీయుల్లో లింగ అసమానత్వం ఎక్కువగా లేదు. 21,342 (45.2శాతం) మహిళలు ఉండగా, 25,718(54.5శాతం) పురుషులు ఉన్నారని నివేదిక తెలిపింది.