Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకధృవ ప్రపంచం కోసం అమెరికా కలలు: రష్యా
వాషింగ్టన్/మాస్కో: మధ్య, స్వల్ప శ్రేణి క్షిపణుల నిర్మూలనకు సంబంధించిన 1987 నాటి అణు క్షిపణుల నియంత్రణ (ఐఎన్ఎఫ్) ఒప్పందం నుంచి తాము వైదొలగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిం చారు. 1987లో అప్పటి అమెరికా అధ్యక్షు డు రోనాల్డ్ రీగన్, సోవియట్ రష్యా అధ్యక్షు డు మిఖాయెల్ గోర్బచేవ్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికాతో పాటు ఐరోపా, తూర్పు ప్రాంత దేశాలకు క్షిపణి ప్రయోగాల నుంచి రక్షణ లభిస్తుంది. భూతలంపై నుంచి 300 మైళ్ల నుంచి 3,400మైళ్ల రేంజ్ కలిగిన క్షిపణులను అమెరికా, రష్యాలు ఉత్పత్తి చేయటం, ప్రయోగం, లేదా కలిగి వుండటం వంటి అంశాలను ఈ ఒప్పందం నిషేధిస్తుంది. దీనితో పాటు భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే క్షిపణులు, అణ్వస్త్ర వాహక క్షిపణుల వంటి వాటికి కూడా ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఈ ఒప్పందం కాల వ్యవధి మరో రెండేండ్లలో ముగియనున్న సమయంలో దీని నుంచి అమెరికా తప్పుకుంటామని ప్రకటించటం విశేషం.
ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోనున్నదంటూ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ తాము ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు. తమ దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను తాము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. అయితే అమెరికా రక్షణశాఖ పెంటగాన్ ఈ ఒప్పందాన్ని సమర్ధిస్తుండగా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఈ నెలారంభంలో ఆయన నాటో మంత్రుల సదస్సులో మాట్లాడుతూ రష్యా తన నోవాటార్ క్షిపణిని ఉపసంహరించుకోకపోతే, అమెరికా ఈ ఒప్పందం ఆంక్షలను ఉల్లంఘించాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. క్షిపణుల నియంత్రణ విషయంలో రష్యా, చైనా కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే తాము ప్రస్తుత ఒప్పందాన్ని రద్దు చేసుకుని, ఆయుధ ఉత్పత్తిని కొనసాగిస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందాన్ని రష్యా ఇప్పటికే పలుమార్లు ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. రష్యా ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ ఒప్పందం పేరుతో తమను అడ్డుకుంటామంటే తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంటే తాము మాత్రం చేతులు ముడుచుకు కూర్చోబోమని ఆయన తేల్చి చెప్పారు.
అమెరికా కలలే: రష్యా
అణుక్షిపణుల నియంత్రణా ఒప్పందం నుంచి వైదొలగటం ద్వారా అమెరికా ఏకధృవ ప్రపంచం కోసం కలలు కంటోందని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో విమర్శించింది. అణు క్షిపణుల నియంత్రణా ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న అమెరికా నిర్ణయాన్ని రష్యా తప్పుపట్టింది.
ఏకధృవ ప్రపంచంలో తమ పెత్తనం కొనసాగించాలని అమెరికా కలలు కంటోందని, అయితే అవి ఎన్నటికీ నెరవేరబోవని విదేశాంగమంత్రిత్వశాఖ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికార వార్తా సంస్థ రియా నోవోస్తి వెల్లడించింది. అణు ఒప్పందాన్ని రద్దు చేయాలన్న అమెరికా ఆలోచనలను తాము పలుమార్లు బహిరంగంగానే ఖండించామని రష్యా గుర్తు చేసింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఈ ఒప్పందాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తోందని, ఇందుకు దశల వారీగా తన నిర్ణయాలను ప్రకటిస్తోందని విమర్శించింది.