Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు ఫ్రాన్స్ హెచ్చరిక
పారిస్ : తమ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యెవెన్ లీ డ్రియాన్ అమెరికాను ఘాటుగా హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. అంతేగాకుండా పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందంపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ - యెవెస్లీ డ్రియాన్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తాము అమెరికా దేశీయ రాజకీయాలను పరిశీలించమని, అటువైపు నుంచి కూడా తాము దానినే కోరుకుంటున్నామని అన్నారు. తాను డొనాల్డ్ ట్రంప్‌కు ఈ విషయం చెప్పానన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ కూడా 'మా దేశాన్ని అలా వదిలిపెట్టండి' అని ట్రంప్‌కు చెప్పారన్నారు. గతనెల 17 నుంచి ఫ్రాన్స్‌లో యెల్లో వెస్ట్ ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అనేక ప్రాంతాల్లో వాహనాలకు నిప్పంటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ శనివారం ట్వీట్లు చేశారు. పారిస్‌లో పగలు, రాత్రి చాలా విచారకరంగా గడుస్తున్నాయని, హాస్యాస్పదమైన, చాలా ఖరీదైన పారిస్ ఒప్పందానికి తెరదించి, తక్కువ పన్నుల రూపంలో ప్రజలకు సొమ్ము తిరిగి ఇవ్వవలసిన సమయం ఇదే కావచ్చునని పేర్కొన్నారు.