Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ పడే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నానని అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి హిందువు తులసి గబ్బార్డ్ వెల్లడించారు. దీంతో 2020లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. హవారు నుంచి నాలుగు సార్లు డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఆమె ఎంపికయ్యారు. అధ్యక్ష ఎన్నికల గురించి ఆమెను ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా అధ్యక్ష ఎన్నికలను తాను సీరియస్గా పరిగణలోకి తీసుకుంటున్నానని సమాధానమిచ్చారు.
ఒకవేళ తులసి గబ్బార్డ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగినట్టయితే.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోయే తొలి హిందువు ఆమె అవుతారు. 2020 ఎన్నికల్లో ఆమె గెలుపొందితే అధ్యక్ష పదవి దక్కిన అత్యంత పిన్న వయస్కురాలిగా, తొలి మహిళగానూ రికార్డు సృష్టిస్తారు. 'నా దేశం వెళ్తున్న మార్గంపై ఆందోళన కలుగుతోంది. దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను' అని గబ్బార్డ్ విలేకరులకు తెలిపారు. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో తలపడాలంటే గబ్బార్డ్ ముందుగా ప్రైమరీ ఎన్నికల్లో సొంత డెమోక్రటిక్ పార్టీ నేతలతో పోటీ పడాల్సి ఉంటుంది. గత కొన్ని వారాలుగా గబ్బార్డ్ పార్టీ నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. అలాగే ఈ విషయంపై ఇండో-అమెరికన్ల అభిప్రాయం తీసుకుంటున్నారు.