Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటన
- వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత బిల్ షోర్టెన్
కాన్బెర్రా : ఇజ్రాయల్ రాజధానిగా పశ్చిమ జెరుసలామ్ను గుర్తిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో పాలస్తీనా-ఇజ్రాయిల్ ఒక శాంతి ఒప్పందానికి వచ్చిన తర్వాతే ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాన్ని టెలీ అవివ్ నుంచి పశ్చిమ జెరుసలేంకు మారుస్తామని చెప్పారు.
అయితే ఆస్ట్రేలియాలో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు బిల్ షార్టెన్ ప్రధాని స్కాట్ మారిసన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాము అధికారంలో రాగానే ఈ నిర్ణయాన్ని మారుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని స్కాట్ మారిసన్ వేసిన ఎత్తుగడగా ఆయన చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్- పాలస్తీనా సంక్షోభంలో ప్రధాన కేంద్రం జెరుసలేం. గత ఏడాది టెల్ అవివ్ నుంచి జెరుసలామ్కు దౌత్య కార్యాలయాన్ని అమెరికా మార్చింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పద జెరుసలాం అంశాన్ని మరింత జఠిలం చేసింది. పాలస్తీనా స్వతంత్ర రాజ్యానికి కూడా జెరుసలేం రాజధానిగా ఉంది. తూర్పు జెరుసలేం పాలస్తీనా రాజధాని అన్నదానికి ఇజ్రాయిల్ ఒప్పుకోవటం లేదు.
అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు..
1967 యుద్ధంలో జెరుసలేంను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. లక్షలాది మంది యూదులను ఇక్కడికి తీసుకొచ్చి వారికి ఇండ్లు కట్టించింది. అంతర్జాతీయ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ క్రమక్రమంగా జెరుసలేం నగరం అంతటినీ ఆక్రమించాలన్న ప్రణాళికను అమలుజేసింది. అయితే జెరుసలేంపై ఇజ్రాయిల్ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు. టెలీ అవివ్నే ఆ దేశ రాజధానిగా పరిగణిస్తూ వస్తున్నారు. టెలి అవివ్లోనే వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్ మాత్రం జెరుసలేం దేశ రాజధానిగా ప్రకటించుకుంది. ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతేడాది మేలో గుర్తిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియా నడుస్తోంది.
అమెరికా నిర్ణయాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2017 డిసెంబరులో ఏకగ్రీవ తీర్మానం చేసింది. జెరుసలేంపై నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది.అమెరికా నిర్ణయం మధ్యప్రాచ్యంలో పాలస్తీనా అంశం ఆరనిమంటగా మార్చింది. జెరుసలేం సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అమెరికా నిర్ణయం తీరని అన్యాయం చేసినట్టే! ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అమెరికా దారిలోనే వెళ్లింది. ఇజ్రాయిల్, అమెరికా వాదనకు వంతపాడుతూ పశ్చిమ జెరుసలేం రాజధానిగా ఆస్ట్రేలియా గుర్తించినట్టు అయ్యింది. జెరుసలామ్లోని డిఫెన్స్‌తో పాటు ట్రేడ్ ఆఫీసును తెరవనున్నట్టు స్కాట్ మారిసన్ చెప్పారు.