Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆర్థిక వేదిక
జెనీవా: పని ప్రదేశాలలో లింగసమానత్వం కోసం మహిళలు అనేక ఏండ్లుగా గొంతెత్తుతున్న నేపథ్యంలో ఈ లక్ష్య సాధనకు మరో రెండు శతాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెలువరించిన తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేతన సమానత్వంలో కొంత మెరుగుదల కన్పిస్తోందని, అయితే ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలంలో లింగ వివక్ష విస్తరించిందని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. రాజకీయ రంగంలో మహిళలకు ప్రాతినిధ్యం తగ్గుతున్న నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య రంగాలలో అసమానతలు విస్తరిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత పరిణామాల ప్రకారం విశ్వవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న లింగ వివక్షకు మరో 108 ఏండ్లకు గానీ తెరపడదని, పని ప్రదేశాలలో ఈ వివక్షకు తెరదించేందుకు మరో 202 ఏండ్లు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని డబ్ల్యూఈఎఫ్ స్పష్టం చేసింది. ప్రపంచంలోని 149 దేశాలలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారికత వంటి అంశాలలో కొనసాగుతున్న లింగ వివక్షపై అధ్యయనం చేసిన డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. గత కొన్నేండ్లుగా విద్య, ఆరోగ్యం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి వాటిలో మహిళలు గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ ఈ ఏడాది వారికి ఈ రంగాలలో ఎదురు దెబ్బలు తగిలాయని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అయితే ఆర్థిక అవకాశాల విషయంలో మాత్రం ఈ వివక్ష కొంతమేరకు తగ్గిందని, అయితే అది సంబరాలు జరుపుకోవాల్సిన స్థాయిలో లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేతనాలలో లింగ వివక్ష 51 శాతం మేర కొనసాగుతోందని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా నాయకత్వ స్థానంలో మహిళల పాత్ర కేవలం 34 శాతానికి మాత్రమే పరిమితమైందని తెలిపింది. అయితే ఆటోమేషన్ ప్రక్రియ పురుషుల ఉద్యోగాలపై చూపుతున్నంత స్థాయిలో సంప్రదా యకంగా మహిళలు చేసే ఉద్యోగాలపై చూపటం లేదని ఈ నివేదిక వెల్లడించింది. శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణిత నైపుణ్యాలు అవసరమైన రంగాల ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా తక్కువ స్థాయిలోనే వుందని తెలిపింది. కృత్రిమ మేధోరంగంలో మహి ళల భాగస్వామ్యం అత్యంత తక్కువ స్థాయిలో ఉందని, ఈ రంగంలో వారి భాగస్వామ్యం కేవలం 22 శాతానికే పరిమితమైందని వివరించింది. పశ్చిమ ఐరోపా దేశాలలో లింగ వివక్షకు తెరపడ టానికి మరో 153 ఏండ్లకు పైగా పడుతుందని, లింగసమానత్వం అత్యధిక స్థాయిలో కొనసాగుతున్న దేశాలలో ఐర్లండ్, నార్వే, స్వీడన్, ఫిన్లండ్ దేశాలు వరుస స్థానాలలో నిలిచాయని వివరించింది. సిరియా, ఇరాక్, పాకిస్తాన్, యెమెన్ దేశాలలో ఈ వివక్ష అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలిపింది. కనిష్ట స్థాయిలో కొనసాగుతున్న లింగ వివక్ష ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ 12 స్థానాన్ని దక్కించుకుని అత్యుత్తమ స్థాయిలో నిలవగా 14వ స్థానంలో జర్మనీ, 15వ స్థానంలో బ్రిటన్, 16వ స్థానంలో కెనడా, 19వ స్థానంలో జర్మనీ నిలిచాయి. కాగా అమెరికా మాత్రం రెండు స్థానాలు దిగజారి ఏకంగా 51వ స్థానంలో నిలిచింది.