Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి: వెనిజులాలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభ పరిష్కారం విషయంలో అమెరికా, రష్యా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు దేశాలు వేరు వేరు ముసాయిదాలను ఐరాస భద్రతామండలిలో చర్చకు పెట్టాయి. వెనిజులాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన అధ్యక్షుడు నికొలస్ మదురోకు ఐరాస అండగా నిలవాలని రష్యా కోరగా, వెనిజులా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. మదురలో ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అమెరికా, రష్యా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. వెనిజులాలో తనకు తాను తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకున్న ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడోకు అమెరికా, దాని మిత్ర దేశాలు మద్దతు ప్రకటిస్తే, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, గినియా, ఇటలీ, మెక్సికో, క్యూబా, బొలీవియా తదితర దేశాలు మదురోకు అండగా నిలిచాయి. వెనిజులాలో పార్లమెంటే సుప్రీం అని అమెరికా చేసిన వాదనతో రష్యా విభేదించింది. అమెరికా కోరితే వెనిజులా ఆంతరంగిక వ్యవహారాలపై భద్రతా మండలిలో బహిరంగ చర్చకు ఎలా పెడతారంటూ రష్యా అభ్యంతరం తెలిపింది. వెనిజులాలో తిరుగుబాటును అమెరికానే ప్రేరేపిస్తోందని రష్యా విమర్శించింది. అమెరికా తీర్మానానికి ప్రత్యామ్నాయ ముసాయిదానొకదానిని రష్యా భద్రతామండలి ముందుంచింది. దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల సభ్యులు శుక్రవారం అనధికారిక చర్చలు సాగించారు. వెనిజులాలో అమెరికా, దాని మిత్ర దేశాల జోక్యాన్ని ఆపాలని కోరుతూ భద్రతా మండలి తీర్మానం చేయాలని రష్యా కోరింది. వెనిజులా అంతర్గత వ్యవహరాల్లో అమెరికా జోక్యం ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్య్రానికే ముప్పుగా పరిణమించిందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెనిజులాలో సైనిక జోక్యం గురించి కూడా పరిశీలిస్తున్నానని చెప్పడాన్ని అది తప్పు పట్టింది. ఈ రెండు ముసాయిదా తీర్మానాల్లో దేనిని భద్రతా మండలిలో ఓటింగ్‌కు పెడతారో ఇంకా తేలాల్సి వుంది. తీర్మానం నెగ్గాలంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలో ఎవరూ వీటో చేయకుండా ఉన్న పక్షంలో తొమ్మిది ఓట్లు అవసరమవుతాయి. అమెరికా తీర్మానం గత ఏడాది వెనిజులా అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదని ఆరోపించింది. వెనిజులా సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని వెనిజులా ప్రజలే చూపుతారని, అందుకు అందరూ మద్దతివ్వాలని రష్యా తీర్మానం పేర్కొంది. సహేతుకమైన పద్ధతిలో చర్చలకు మాంటెవీడియో మెకానిజం లాంటివి ఏర్పాటు చేయాలని అది కోరింది. ఇదిలా వుండగా యూరోపియన్, లాటిన్ అమెరికన్ నాయకులు ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోలో గురువారం కూర్చొని వెనిజులా సంక్షోభ పరిష్కారానికి మార్గాలను వెతికారు.వెనిజులాలో విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో మదురోకు సహకరించేందుకు వీలుగా భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించాలని రష్యా ముసాయిదా కోరింది. వెనిజులాలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలను ఎటువంటి ముందస్తు షరతులు, విదేశీ జోక్యంతో సంబంధం లేకుండా శాంతియుతమైన చర్చల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలనిా అది కోరింది. వెనిజులాలోని మదురో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య శాంతియుత చర్చల ప్రక్రియను ప్రోత్సహించేందుకు మెక్సికో, ఉరుగ్వే, బొలీవియా, కారికామ్ దేశాల వేదిక తీసుకుంటున్న చర్యలను తాము గట్టిగా సమర్దిస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది. శాంతియుత చర్చల ప్రతిపాదనకు బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ తన మద్దతు ప్రకటించారు.