Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబన్ వైద్యుల అసాధారణ విజయం
శాంటియాగో: తాము అమలు చేస్తున్న సమగ్ర క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమంలో క్యాన్సర్ బాధిత చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట వేయటం ద్వారా అసాధారణ విజయాన్ని సాధించామని క్యూబాకు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ ఇమ్యునాలజీ (సీఐఎం)డైరెక్టర్ డా.అగస్టిన్ లాగే చెప్పారు. తాము అమలు చేస్తున్న కార్యక్రమం ద్వారా క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పడుతున్న చిన్నారుల సంఖ్య ఏటా తగ్గుతోందని ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. తాము అనేక సంవత్సరాలు చేసిన కృషి, క్యూబా ప్రజారోగ్య మంత్రిత్వశాఖ అమలులోకి తెచ్చిన విధానాల ఫలితంగానే తాము ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. క్యాన్సర్ నివారణ చికిత్సలో భాగంగా అత్యాధునిక, సంక్లిష్ట ఔషధాలను అందుబాటులోకి తేవటం తాము సాధించిన మరో విజయమని ఆయన తెలిపారు. తమ కృషి వల్ల క్యాన్సర్ రోగులందరికీ ఆర్థిక పరిమితులతో సులభసాధ్యం కాని ఈ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. తాము సాధించిన ఈ విజయంలో జాతీయ ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమ రంగాల కృషి కీలకమైందని అన్నారు. ఇతర దేశాలలో అవి లాభార్జనే ధ్యేయంగా అత్యంత ఖరీదయిన ఔషధాలను మార్కెటింగ్ చేస్తుంటాయని, క్యూబాలో మాత్రం లాభార్జన ధ్యేయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వంతో సహకరించటం ద్వారా శిశుమరణాలకు అడ్డుకట్ట వేయటంలో భాగస్వాములయ్యాయని ఆయన చెప్పారు.