Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరెన్ని చెప్పినా డోంట్ కేర్ నేను ఎవరి మాట వినను అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణ వివాదం రోజురోజుకు ముదురుతోంది. పట్టువిడుపుల్లేని తీరుతో ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన నిర్ణయాలు ప్రజలకు సంకటంగా మారాయి. 2016లో అమెరికా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్లు (దాదాపు 40 వేల కోట్లు) కావాలంటూ ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇటీవల ఐదువారాల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. అమెరికాలో మరో షట్‌డౌన్ రాకుండా ఉండడం కోసం మధ్యేమార్గంగా కాంగ్రెస్ 1.4 (దాదాపు 10 వేల కోట్లు) బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఇవి ఏమాత్రం సరిపోవని, తాను కోరుకుంటున్నట్టు గోడ నిర్మాణానికి సుమారు ఎనిమిది బిలియన్ డాలర్లు (దాదాపు 57 వేల కోట్లు) అవసరమని ట్రంప్ పట్టుబట్టారు. ఇందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులతో పాటు తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి ఇతర నిధులను వినియోగిస్తానం టున్నారు ట్రంప్. సరిహద్దులో గోడ కోసం కాంగ్రెస్‌తో గొడవ పడుతున్న ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆయన మొండివైఖకరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం ట్రంప్ జాతీయ అత్యవరసర పరిస్థితి విధించడంపై 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు నిధుల మళ్లింపునకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బీసెర్రా, ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికుల కోసం, విపత్తుల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో.. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. యూఎస్‌లో మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం.
జాతీయ అత్యవసర స్థితి...
దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు జాతీయ అత్యవసర చట్టాన్ని విధిస్తారు. దేశ దక్షిణ తీరంలో వలస సంక్షోభం ఏర్పడిందనే కారణంతో ట్రంప్ ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు. అయితే, వలసలపై విశ్లేషించే నిపుణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ అత్యవసర స్థితి విధించడం వల్ల అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు వస్తాయి. రాజకీయ ప్రక్రియ లేకుండానే ఆర్మీ లేదా విపత్తు ఉపశమ నానికి కేటాయించిన నిధులను గోడ నిర్మాణానికి మళ్లించే అధికారం లభిస్తుందన్నారు. సైనికుల నిధుల్ని దారి మళ్లించినట్టయితే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
గోడ కడితే ఈ అడవి పిల్లులు కనబడవ్..
మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ కడతానంటున్న గోడ వల్ల అక్కడ అరుదైన అడవి పిల్లులు కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. ఆరిజోనా ప్రాంతంలో చిరుతపులి చారలతో కనబడే అరుదైన అడవి పిల్లులు (ఓసిలాట్స్) చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి చూడ్డానికి పెద్ద సైజు పిల్లుల్లా, చిన్న సైజు చిరుతల్లా ఉంటాయి. ఇటీవల జంతు ప్రేమికులు రిమోట్ సెన్సర్ కెమెరాలను ఉపయోగించి ఓ అడవిపిల్లి కదలికలను గుర్తించారు. సరిహద్దుల్లో గోడ నిర్మాణం జరిగినట్టయితే వీటి మనుగడకు ముప్పు తప్పదని జంతు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.