Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, లేబర్ పార్టీ నేత బాబ్ హాక్ (89) మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున బాబ్ హాక్ తమ నివాసంలో తుది శ్వాస విడిచినట్టు భార్య బ్లాంచె డీ అల్పుగెట్ ఓ ప్రకటనలో తెలిపారు. బాబ్ మృతి పట్ల లేబర్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆస్ట్రేలియా ప్రధానిగా దీర్ఘకాలం సేవలందించి బాబ్ రికార్డు సృష్టించారు. సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ నేతగా అమూల్య సేవలందించారు. ఆయన పదవీకాలంలో చేపట్టిన పలు కీలక సంస్కరణల కారణంగా ఆస్ట్రేలియా ప్రగతి పథంలో శరవేగంతో దూసుకెళ్లింది. 1983 నుంచి 1991 మధ్య కాలంలో చరిష్మా ఉన్న కీలక నేతగా ప్రజాభిమానం చూరగొన్నారు. వామపక్ష భావజాలం ఉన్న బాబ్ 18 ఏండ్ల వయసులో లేబర్ పార్టీలో చేరారు. రోడ్స్ సంస్థ అందించిన ఉపకారవేతంతో 1953లో ఆక్స్ఫర్డ్ వర్సిటీలో అడ్మిషన్ పొంది ఉన్నత విద్యను అభ్యసించారు.
లక్షలాది మంది ఆస్ట్రేలియన్లలో స్ఫూర్తి నింపిన మహానేతగా ఎదిగారు. కార్మికుల సమస్యలపై చలించేవారు. 1969లో ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1983లో కార్మిక నేతగా బాధ్యతలు చేపట్టారు. బాబ్ మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 'ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఓ మహానేతను కోల్పోయాం' అని మాజీ ప్రధాని, లేబర్ పార్టీ నేత కెవిన్ రూఢ్ ట్వీట్ చేశారు.