Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైపుణ్యమున్న ఉద్యోగుల కోటాను 12 నుంచి 57కి పెంచిన ట్రంప్ సర్కార్
వాషింగ్టన్ : ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డులను 'బిల్డ్ అమెరికా' వీసాలతో భర్తీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. కొత్త విధానంలో అత్యున్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచుతామని అన్నారు. అయితే, ప్రతి ఏడాది కేటాయించే గ్రీన్ కార్డుల సంఖ్యను మాత్రం మార్చే యోచనలో వైట్ హౌస్ లేదని అన్నారు. శ్వేత సౌధంలోని రోజ్ గార్డెన్ లో ట్రంప్ తన కొత్త ప్రతిపాదనను వివరిస్తూ 'వలసదారులు రావాలని కోరుకుంటున్నాం. మా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని భావిస్తున్నాం. కానీ ఈ వలసదారుల్లో ఎక్కువ భాగం తమ ప్రతిభ, నైపుణ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది. ప్రపంచంలో మీరెక్కడ పుట్టారు? మీ బంధువులెవరు? అనేవి కాకుండా మీరు అమెరికా పౌరుడు కావాలంటే మేం కోరుకుంటున్న ప్రమాణాలను మీరు సాధించాలి. దీనివల్ల మా దేశంలో వలసల్లో వైవిధ్యం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ క్యాటగిరీలను కొత్త వీసాతో భర్తీ చేస్తాం. అది బిల్డ్ అమెరికా వీసా' అని తెలిపారు. ఏటా అమెరికా సుమారుగా 11లక్షల గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. గ్రీన్ కార్డులు ఉంటే ఇతర దేశాలకు చెందినవారు జీవిత కాలం పాటు అమెరికాలో నివసించేందుకు, ఉద్యోగం చేయవచ్చు. అంతేగాకుండా, ఐదేండ్లలో యూఎస్ పౌరసత్వం పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం చాలా వరకు గ్రీన్ కార్డులు కుటుంబ సంబంధాలు, వైవిధ్యం వీసా ఆధారంగా జారీ చేస్తున్నారు. నిపుణులు, అత్యుత్తమ నైపుణ్యాలు కలవారికి చాలా తక్కువగా కార్డులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతమున్న విధానంలో సవరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించుకుంది. కెనడాలో ఉన్న వీసా విధానాన్ని అమలుపరచాలని భావిస్తున్నది.
హెచ్-1బీ వీసా తిరస్కరించిన ట్రంప్ సర్కార్‌పై కేసు
భారత టెక్కీకి ఉద్దేశపూర్వకంగా హెచ్-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో దావా వేసింది. వివరాల్లోకి వెళితే.... సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్సెటెర్రా సొల్యూషన్స్ సంస్థ యూఎస్ సిటిజెన్షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌పై ( యూఎస్సీఐఎస్) అక్కడి కోర్టులో ఫిర్యాదు చేసింది. భారత్‌కు చెందిన ప్రహర్ష్ చంద్రసాయి వెంకట అనిశెట్టి (28) అనే టెక్కీకి తమ సంస్థలో పనిచేసేందుకు నియమించుకుంది. అయితే ప్రహర్ష్ చంద్రకు హెచ్-1 బీ వీసా ఇవ్వకుండా కావాలనే అడ్డుకుంటోందని తన పిటిషన్లో పేర్కొంది. బిజినెస్ సిస్టం అనలిస్టుగా ఆయన్ను సదరు సంస్థ నియమించుకుంది. అనిశెట్టి తరపున కంపెనీ హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేయగా దాన్ని తిరస్కరించింది. హెచ్-1బీ స్పెషాలిటి ఆక్యుపేషన్ కింద అనిశెట్టి దరఖాస్తు క్వాలిఫై కాలేదనే కారణాలు చూపి ఆయన వీసా దరఖాస్తును తిరస్కరిస్తోందంటూ క్సెటెర్రా కంపెనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన వివరణ యూఎస్సీఐఎస్ సంస్థ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అనిశెట్టి హెచ్-1బీ వీసాకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలని కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టును కంపెనీ అభ్యర్థించింది.