Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను డిమాండ్ చేసిన కాస్ట్రో
- సన్నిహితులు, అభిమానుల సమక్షంలో కాస్ట్రో జన్మదిన వేడుకలు
హవానా: ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆర్థిక, వాణిజ్య దిగ్బంధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన క్యూబాకు కోట్లాది డాలర్ల పరిహారం చెల్లించాలంటూ క్యూబా విప్లవాధినేత ఫైడల్ కాస్ట్ట్రో అమెరికాను డిమాండ్ చేశారు. తన జన్మదిన సందర్భంగా క్యూబా అధికార పత్రిక గ్రాన్మాకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విధంగా ప్రస్తావించారు . ఫైడల్ కాస్ట్రో తన 89వ జన్మదిన వేడుకలను సన్నిహితులు, అభిమానుల మధ్య గురువారం నిరాడంబరంగా జరుపుకున్నారు. ముందుగా ప్రస్తుతం హవానా పర్యటనలో వున్న బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరేల్స్ను ఆయన బస చేసిన హౌటల్లో కలిసిన కాస్ట్రో ఆయన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాస్ట్రో వెంట ప్రస్తుతం క్యూబా పర్యటనలో వున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో కూడా వున్నారని బొలీవియన్ వార్తా సంస్థ ఎబిఐ వెల్లడించింది. వాస్తవానికి కాస్ట్రోను ఆయన నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయాలని మొరేల్స్ భావించారని, అయితే తాను అమితంగా అభిమానించే విప్లవనేత పరిపూర్ణ ఆరోగ్యపరిస్థితిలో తన వద్దకు వ్యాన్లో రావటంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారని ఎబిఐ వివరించింది. వెనిజులా సోషలిస్టు ప్రభుత్వ నేతృత్వంలోని అల్బా కూటమికి చెందిన 11 సభ్యదేశాల ప్రతినిధులు హవానాకు వచ్చి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారని ఆ సంస్ధ తెలిపింది. హవానాలో తమ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ క్యూబా పర్యటనకు రావటానికి ముందురోజు కాస్ట్రో జన్మదిన వేడుకలు జరగటం విశేషం. దేశ పౌరులందరికి ఆరోగ్యం, విద్య ఉపాధి, ఆహారం, భద్రత, సంస్కృతి, శాస్త్రవిజ్ఞానం, సంక్షేమం వంటి అంశాలలో సమాన హక్కులుండాలన్నది తన ఆకాంక్ష అని ఫైడల్ కాస్ట్రో వివరించారు. వెనిజులా అధ్యక్షుడు మదురో కాస్ట్రోకు ట్విట్టర్లో కూడా శుభాకాంక్షలు తెలియచేశారు.