Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హీన్జ్ క్రిస్టియన్
- స్టింగ్ ఆపరేషన్ వీడియో ఫుటేజ్ బహిర్గతం చేసిన మీడియా సంస్థలు
వియన్నా : ఆస్ట్రియా వైస్ ఛాన్సెలర్, ఫార్రైట్ ఫ్రీడమ్ పార్టీ నేత హీన్జ్ క్రిస్టియన్ తన పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని ఛాన్సెలర్ కర్జ్కు అందజేయగా ఆమోదం లభించిందన్నారు. హీన్జ్ పదవీ బాధ్యతలను రవాణా శాఖ మంత్రి నార్బర్ట్ హౌఫర్కి ప్రభుత్వం అప్పగించనున్నట్టు సమాచారం. ఈనెల 23 నుంచి 26 వరకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో కీలక మంత్రి తన పదవికి రాజీనామా చేయడంతో ఆస్ట్రియా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, హీన్జ్ క్రిస్టియన్ అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో సహా రెండు జర్మనీ మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈమేరకు ఓ వీడియోను కూడా తాజాగా విడుదల చేశాయి.ఈ వీడియోలో రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టులను హీన్జ్ అత్యంత రహస్యంగా, అక్రమ మార్గాల్లో ఓ విదేశీ మహిళకు అప్పగిస్తున్నట్టు ఉన్నది. అంతేగాకుండా, హీన్జ్, విదేశీ మహిళకు మధ్య జరిగిన రహస్య సంభాషణలో రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన కూడా ఉన్నది. 2017లో ఆస్ట్రియా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టు సుడెస్చే జీటంగ్, దేర్ స్పీగల్ అనే పత్రికలు వెల్లడించాయి. ఐబీజా ద్వీపకల్పంలోని ఓ విలాసవంతమైన హౌట్లో హీన్జ్, విదేశీ మహిళకు మధ్య ప్రభుత్వ కాంట్రాక్టుల ఒప్పందం కుదిరినట్టు ఆ పత్రికలు వెల్లడించాయి. అయితే, ఈ స్టింగ్ ఆపరేషన్ను ఎవరు నిర్వహించారో, ఈయూ ఎన్నికల ముందు ఎందుకు వీడియో దృశ్యాలను విడుదల చేశారో మాత్రం వెల్లడించేందుకు ఆ పత్రికలు నిరాకరించాయి. హీన్జ్ తన పదవికి రాజీనామా చేయాలని మెజారిటీ పౌరులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. కాగా, ఈ వీడియో దృశ్యాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, దేశప్రజలకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నానని మీడియా సమావేశంలో హీన్జ్ తెలిపారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక కుట్ర దాగివుందని అనుమానం వ్యక్తం చేశారు. తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు తెలిపారు.