Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానిగా మళ్లీ మోరిసన్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రధాని మోరిసన్ విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలు సాధించింది. ఓట్ల లెక్కింపు 85శాతం పూర్తికాగా మెజార్టీకి అవసరమైన 76స్థానాల్లో కన్జర్వేటివ్ సంకీర్ణం ముందంజలో కొనసాగుతోంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 66 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఎన్నికల ఫలితాలపై ప్రాథమిక సమాచారం వెలువడిన అనంతరం లేబర్ పార్టీ నాయకుడు తమ ఓటమిని అంగీకరిస్తూ ఆదివారం ప్రకటన చేశారు. ఇది తమ జీవితకలల సాఫల్యానికి నిరంతరం కష్టపడుతున్న ప్రతి ఒక్క ఆస్ట్రేలియా పౌరుడి విజయమని సిడ్నీలో ఆదివారం జరిగిన విక్టరీ పార్టీలో మోరిసన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవాసులకు తాము చేయాల్సింది చాలా ఉందనీ, వారి అభ్యున్నతి కోసం తాము పునరంకితమవుతామనీ, తమ ప్రభుత్వం వారి కలలు సాకారం చేస్తుందనీ మోరిసన్ ప్రకటించారు.
ప్రతిపక్ష లేబర్‌పార్టీ గెలుపుఖాయమంటూ కొద్దికాలంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వేసినప్పటికీ మెజార్టీ సీట్లను కన్జర్వేటివ్ సంకీర్ణం గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ప్రధానిని ఎన్నుకునేందుకు గత శనివారం జరిగిన ఎన్నికల్లో 1.6కోట్లమంది ఓటేశారు. మొత్తం 151 సీట్లలో అధికార పార్టీ ఇంతవరకూ 76 స్థానాల్ని కైవసం చేసుకోవడంతో మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. లేబర్ పార్టీ 66 స్థానాలు గెలుచుకుంది. కాగా, లేబర్‌పార్టీ నేత బిల్ షార్టెన్ ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ తాను పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.