Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మే సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్7న ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశంకోసం నిబద్ధతతో పనిచేశానని ఇందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. వచ్చేనెల7న కన్జర్వేటివ్ పార్టీ నేతగా రాజీనామా చేయనున్నానని, కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ తాను రాజీనామా చేసిన వెంటనే మొదలవుతుందన్నారు. అప్పటివరకు తాను ప్రధానిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు, ఆందోళనలు, బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం, బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒత్తిడికి తలొగ్గిన మే చివరకు రాజీనామా బాట పట్టారు. ' రెండో మహిళా ప్రధానిగా దేశానికి సేవలందించడం నా అదృష్టం. కానీ కచ్చితంగా ఇది చివరిది కాదు' అని మే వ్యాఖ్యానించడం విశేషం.