Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటిష్ ప్రధాని థెరిసా మే తన రాజీనామా గురించి ప్రకటించడంతో ఆ కుర్చీ కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. బ్రిటిష్ మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ వంటి వారు ప్రధాని పదవి రేసులో ఉన్నారు. ప్రధాని పదవికి తాను కూడా పోటీ పడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మాటి హాన్కాక్ శనివారం నాడు బిబిసికి వెల్లడించారు. ఉన్నత పదవి రేసులో తాను లేనని చెప్పిన హోం శాఖ మంత్రి అంబర్ రూడ్ పార్టీని ఐక్యంగా నడపగలిగిన సత్తా ఉన్న నాయకులెవరైనప్పటికీ, వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే, ఆ నాయకుని పేరు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. బోరిస్ జాన్సన్ గురించే కదా మీరు మాట్లాడుతున్నారని అడగ్గా ఏమాత్రం తటపటాయించకుండా ఆయన నిజాయితీగత రాజకీయవేత్త అని బదులిచ్చారు. ఆయనే కాదు, ఇంకా కొందరు మంచి రాజకీయ నాయకులు ఉన్నారని అన్నారు. జాన్సన్ మంత్రివర్గంలో తాను పనిచేయడానికి సిద్ధంగా లేనని అంతకుముందు స్టివార్ట్ చెప్పారు. నోడీల్ బ్రెగ్జిట్ కోసం పట్టుబట్టినవారిలో స్టివార్టు ఒకరు. జాన్సన్ మాట్లాడుతూ, ఒప్పందం కుదిరినా, కుదరకున్నా అక్టోబర్ కల్లా ఇయు నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తుందని చెప్పారు. టోరీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేత ఎంపిక ప్రక్రియ జూన్10నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు నెలలకు పైగా పడుతుంది. బ్రెగ్జిట్‌కు తాజాగా నిర్ణయించిన గడువు అక్టోబర్ 31 కాగా, కొత్తగా ఎంపికయ్యే ప్రధాని మరింత వ్యవధి కావాలని కోరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మే వారసుడిగా ఎంపికయ్యేవారు ఎవరైనా వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరిమీ కార్బిన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న యూరపు పార్లమెంట్ ఎన్నికల్లో బ్రెగ్జిట్ ఏకైక ప్రాధాన్యతాంశంగా బరిలోకి దిగిన బ్రెగ్జిట్ పార్టీ విజయం సాధించే అవకాశాలుండటంతో తక్షణ ఎన్నికలు కూడా ప్రమాదకరమేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వారసత్వ ఎంపికలో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ తదితర ప్రముఖులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.