Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేము ఒంటరిగా లేము : హువేయీ సీఈఓ రెన్ జెంగ్ఫై
న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు తమ ఉత్పత్తులపై, కంపెనీ సరఫరాదారులపై ఎలాంటి ప్రభావం చూపబోదనీ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ 'హువేయీ' సీఈఓ రెన్ జెంగ్ఫై అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు, తమ కంపెనీ అమెరికా ఆగ్రహానికి బెదిరిపోయే పరిస్థితిలో లేవని అన్నారు. ఆదివారం బీజింగ్‌లో చైనా మీడియాతో జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 5జీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న తమ ఉత్పత్తుల తయారీకి ఎలాంటి ఆటంకాలూ లేవనీ, అమెరికా కంపెనీ సరఫరాలపై ఆంక్షల ప్రభావం పడినా మరోచోట ఉన్న సరఫరాదార్ల నుంచి ఉత్పత్తులు పొందుతామనీ ఆయన అన్నారు. హువేయీ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రచారంలో పెద్దగా పసలేదని అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మి ఇతర దేశాలు కూడా అమెరికాను అనుసరించే పరిస్థితి లేదని చెప్పారు. హువేయీ, దానికి చెందిన 68 అనుబంధ సంస్థలు అమెరికాకు చెందిన సంస్థల నుంచి ఎటువంటి సాంకేతికత కొనుగోలు చేయకుండా అధ్యక్షుడు ట్రంప్ గతవారం ఆంక్షలను విధించారు. దీనికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని అమెరికా పేర్కొంది. దీంతో హువేయీతో అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఇంటెల్, క్వాల్కామ్, బ్రాడ్‌కామ్ సంస్థలు తెగదెంపులు చేసుకొన్నాయి. అయితే, హువేయీపై నిషేధాన్ని అమెరికా 90 రోజులు సడలించింది. దీంతో హువేయీ ఫోన్లకు గూగుల్ యాప్ సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇది చైనాతో వాణిజ్య యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.
'పెద్దగా ఆందోళన చెందటం లేదు'
అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాల్లోని కంపెనీల నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎలా పొందుతారు? అని హువేయీ సీఈఓ రెన్ జెంగ్ఫైని ప్రశ్నించగా, ఆయన ఏమన్నారంటే...''వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులతో మేం మాట్లాడుతున్నాం. ప్రతీదేశం తనదైన ఆర్థిక ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది. అమెరికా విధించిన ఆంక్షలు, మా కంపెనీపై చేసిన ప్రచారాన్ని మిగతా దేశాలు పరిగణలోకి తీసుకుంటాయని అనుకోవటం లేదు''అని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...''చిప్, సెమీకండక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మావద్ద ఉంది. ఈ రంగంలో ప్రత్యర్థులు మమ్మల్ని అందుకోవడానికి రెండు, మూడేండ్లు పడుతుంది. మా భాగస్వామ్య సంస్థల నుంచి సరఫరాలు ఆగిపోతే, అదేమీ పెద్ద సమస్య కాదు. మాకు అవసరమయ్యే 'హై ఎండ్ చిప్స్' మేము తయారుచేసుకోగల''మని అన్నారు. ఇతర దేశాలతో మేము ఏర్పరుచుకున్న వాణిజ్య సంబంధాలు అంత సులభంగా తెగిపోయేవి కావని అన్నారు.