Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మితవాద శక్తులు
- బ్రిటన్‌లో బ్రెగ్జిట్ పార్టీ, ఫ్రాన్స్‌లో లీపెన్, జర్మనీలో గ్రీన్స్ దూకుడు
- గ్రీస్ ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
బ్రస్సెల్స్: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎన్నికలుగా పిలువబడే ఐపోరా పార్లమెంటు ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేక, పచ్చిమితవాద, లిబరల్, కన్సర్వేటివ్, పార్టీలు బలం పెంచుకున్నాయి. నయా ఉదారవాద విధానాల దుష్ఫలితాలు, ఐరోపా కూటమి భవిష్యత్తుపై అనిశ్చితి, వాతావరణ మార్పులపై సర్వత్రా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో బ్రెగ్జిట్ పార్టీ, ఫ్రాన్స్‌లో మేరీ లీపెన్ నేతృత్వంలోని పచ్చి మితవాద పార్టీ నేషనల్ ర్యాలీ, జర్మనీలో గ్రీన్స్, ఇటలీలో మితవాద ఇటలీ లీగ్ బలాన్ని పెంచుకున్నాయి. స్పెయిన్‌లో సోషలిస్టులు మంచి మెజార్టీనే సాధించారు. గ్రీస్‌లో సిప్రాస్ నేత్వృంలోని సిరిజా పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లో జాతి వ్యతిరేకత, ఇస్లామిక్ వ్యతిరేకత, విదేశీ వ్యతిరేకత, విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరైన మెరీ లీపెన్ పార్టీ 23.31 శాతం ఓట్లతో 22 సీట్లు సాధించి మాక్రాన్ పార్టీ కన్నా ముందంజలో ఉన్నది. మాక్రాన్ నేతృత్వంలోని లా రిపబ్లికా ఎన్‌మార్చ్ పార్టీ 22.41 శాతం ఓట్లతో 21 సీట్లతో వెనుకబడింది. మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ సారథ్యంలోని రిపబ్లికన్స్ పార్టీకి 8.4 శాతం, లెఫ్ట్ పార్టీలకు 6.3 శాతం ఓట్లు లభించాయి. గత ఆరు మాసాలుగా కొనసాగుతున్న యెల్లో వెస్ట్స్ ఉద్యమం మాక్రాన్ ప్రభుత్వ విధానాలపై ఒక తిరుగుబాటు లాంటిది. ఇప్పుడీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికనే చేశాయి. వాతావరణ మార్పుల సంక్షోభం పై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను గ్రీన్స్ పార్టీ చక్కగా ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంది. ఈయూ పార్లమెంటులో 69 స్థానాలను గెలుచుకుని బలమైన శక్తిగా ఆవిర్భవించింది. గత సారి ఈ పార్టీకి 51 స్థానాలు మాత్రమే ఉండేవి. జర్మనీలో ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని సిడియు మొదటి స్థానంలో వుండగా, గ్రీన్స్ రెండవ స్థానంలో నిలిచింది. ఐర్లండ్‌లో మొదటి స్థానం, ఫిన్లాండ్లో 16 శాతం ఓట్లతో రెండవ స్థానంలోను, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్‌లో మూడవ స్థానంలోను, బెల్జియం, నెదర్లాండ్స్‌లో మూడవ స్థానం సాధించింది. ఆస్ట్రియాలో రెండు స్థానాలు సాధించింది. తూర్పు, దక్షిణ యూరపు దేశాల్లో గ్రీన్స్‌కు ఒక్క స్థానం కూడా లభించలేదు.
పోలండ్, హంగరీ, ఇటలీల్లో మితవాద గ్రూపు లు ప్రభావం చూపించాయి మొత్తం 751 స్థానా లున్న ఈయూ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ 376. ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం యూరపు అనుకూల కూటమికి అసా ధ్యంగా మారింది. లిబరల్ అల్డే గ్రూపు, గ్రీన్స్ మద్దతు ఈ కూటమికి అవసరం. ఈపీపీ, ఎస్అండ్డీ గ్రూపు లు, నాలుగు ఈయూ అనుకూల గ్రూపలకు 50కిపైగా స్థానాలు లభించాయి. దీంతో నూతన పార్లమెంటు లో లిబరల్స్ గ్రూపు కింగ్ మేకర్ పాత్ర పోషించనున్నది. ఐరోపా అనుకూలకూటమి ఈపీపీ, సోషల్ డెమొక్రాటిక్ కూటమి బలం తగ్గడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదని బెర్లిన్‌లోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన యూరోపియన్ స్టడీస్ ప్రొఫెసర్ యులి బ్రూకెనర్ వ్యాఖ్యానించారు. ఐక్య, సమగ్ర ఐరోపాకు ఇయు ఇస్తున్న నిర్వచనాన్ని ఈ ఎన్నికల ఫలితాలు సవాలు చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో యూరోస్కెప్టిక్ పార్టీల విజయపరంపర కూటమిలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోందని, ఐరోపా కూటమి నిర్మాణమే పూర్తిగా విఫలమైందని నేషనల్ ర్యాలీ పార్టీ ప్రతినిధి డెన్నిస్ ఫ్రాన్సిస్కిన్ అభిప్రాయపడ్డారు.
యూకేలో బ్రెగ్జిట్ పార్టీ ఆధిక్యం
బ్రిటన్‌లో జరిగిన ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో బ్రెగ్జిట్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. బ్రెగ్జిట్ పార్టీ తరఫున ఐరోపా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ రాజకీయవేత్త నైజెల్ ఫరాజ్ భారీ మెజార్టీతో తన ప్రత్యర్థులైన కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ అభ్యర్థులను ఓడించారు. సోమవారం ఉదయం ప్రకటించిన ప్రాథమిక ఫలితాల ప్రకారం ఇయులో బ్రిటన్‌కు వుండే 73 స్థానాలలో బ్రెగ్జిట్ పార్టీ 28 స్థానాలను దక్కించుకుంది. లిబరల్ డెమొక్రాట్స్ 20 శాతం ఓట్లతో 15 స్థానాలను కైవసం చేసుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కింది. లేబర్ పార్టీ 14.1 శాతం ఓట్లు, కన్సర్వేటివ్ పార్టీకి 9.1 శాతం ఓట్టు వచ్చాయి. ఇక లేబర్ పార్టీకి 10 స్థానాలు లభించగా తరువాతి స్థానాలలో నిలిచిన గ్రీన్స్ పార్టీ ఏడు స్థానాలను దక్కించుకోగా, పాలక కన్జర్వేటివ్ పార్టీ 10 శాతం ఓట్లతో కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మొత్తంగా చూసినప్పుడు బ్రెగ్జిట్ అనుకూల పార్టీలకు 34. 9 శాతం ఓట్లు లభించగా, బ్రెగ్జిట్ వ్యతిరేక పార్టీలకు 40 శాతం ఓట్లు వచ్చాయి.
ప్రధానివైదొలగాలని గ్రీస్ ప్రతిపక్షం డిమాండ్
ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న సిప్రాస్
ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో గ్రీస్ అధికార పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని గ్రీక్ ప్రధాన ప్రతిపక్షం న్యూ డెమొక్రసీ పార్టీ నేత కిరయకోస్ మిట్సోటకిస్ డిమాంఢ్ చేశారు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి వెనుకంజలో వుండటంతో ప్రధాని తన పదవికి రాజీనామా చేసి పార్లమెంట్‌కు ముందుస్తు ఎన్నికలు ప్రకటించాలని ఆయన సూచించారు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎన్డీకి 32.7 శాతం ఓట్లు లభించగా అధికార రాడికల్ లెఫ్ట్ సిరిజా పార్టీకి 24 శాతం ఓట్లు లభించాయి.