Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: హెచ్4 వీసాలను రద్దు చేయాలన్న ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం విదేశీయుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన సెనెటర్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో, హెచ్ 4 వీసాదారులకు కాస్త ఊరట లభించే అవకాశముంది. అన్నా జి ఎషో, జో లాఫ్గ్రెన్ అనే చట్టసభ ప్రతినిధులు వీసాదారుల రక్షణ కోసం హెచ్4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-4 వీసాల ఆధారంగా పని చేయడానికి అనుమతులు పొందుతున్నవారిపై నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించనున్నామని అక్కడి హౌమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ప్రకటించిన నేపథ్యంలో వారు ఈ బిల్లు ప్రవేశ పెట్టడం గమనార్హం.
ఒబామా హయాంలో హెచ్4 వీసాలు ...
హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసాలు మంజూరు చేసే విధానాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టారు. హెచ్ 1బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21ఏండ్ల లోపు వయసున్న పిల్లలకు హెచ్ 4 వీసా ఇస్తారు. హెచ్-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరిట ఒబామా హయాంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ వీసా ద్వారా వారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. అమెరికాలో సాంకేతిక నిపుణుల కొరత ఉండటంతో ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ఒబామా ప్రభుత్వం హెచ్ 4వీసాలను తెరపైకి తెచ్చింది. దీంతో, పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్ 1బీ వీసాదారుల భార్య లేదా భర్తలు కూడా ఉద్యోగం చేసే అవకాశం లభించింది. దీని ద్వారా సిలికాన్ వ్యాలీ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఎంతో ఉపశమనం లభిస్తోంది.
వీసా రద్దుకు ట్రంప్ మొగ్గు
హెచ్-4వీసాల వల్ల చైనా, భారత్ తదితర దేశాలకు చెందిన వారు లాభపడుతున్నారని, స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్... ఒబామా సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 2018 అక్టోబర్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హౌంల్యాండ్ సెక్యూరిటీ కూడా ఈ ప్రతిపానకు పచ్చజెండా ఊపడంతో హెచ్-4 వీసాదారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ట్రంప్ సర్కార్ నిర్ణయంతో అత్యంత నైపుణ్యమున్న అనేక మంది హెచ్-4 వీసాదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. దీనివల్ల ప్రాంతీయంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఈ చట్టం ద్వారా దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ట్రంప్ పాలక వర్గానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో సెనెటర్లు వారందరికీ భరోసా ఇస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో ట్రంప్ సర్కారు హెచ్-4 వీసాల రద్దు విషయంలో పునరాలోచించే అవకాశం ఉంది.