Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడిపై లండన్ మేయర్ ఫైర్
లండన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిప్పులు చెరిగారు. ' ట్రంప్ 20వ శతాబ్దపు నియంత. ఆయనలో నియంతృత్వ భావాలు ఉన్నాయి. ట్రంప్ ఉపయోగిస్తున్న భాష ఆయనలోని నియంతృతానికి నిలువెత్తు నిదర్శనం' అని అన్నారు. సతీసమేతంగా బ్రిటన్‌లో పర్యటించనున్న ట్రంప్‌ను ఉద్దేశించి సాదిఖ్ ఖాన్ మాట్లాడారు. 'మితవాద భావాలు, నియంతృత్వ పోకడ ఉన్న ట్రంప్‌కు లండన్ నగరంలో ఎర్రతివాచీ పర్చడం మనందరి దురదృష్టకరం. అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆయన చర్యలు ప్రపంచ దేశాల్లో అశాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఉన్నాయి. విక్టర్ ఓర్బాన్ ( హంగేరీ ప్రధాని) మాట్టియో సాల్విని( ఇటలీ విదేశాంగ మంత్రి), మరీన్ లీ పెన్ ( నేషనల్ ర్యాలీ పార్టీ ప్రెసిడెంట్), నైగెల్ ఫరేగ్ ( ఈయూ ఎంపీ) వంటి నేతలంతా ట్రంప్ చర్యలను అనుసరిస్తూ నియంతల్లా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2016లో లండన్ మేయర్‌గా గెలుపొందిన నన్ను ఐక్యూ పరీక్ష పెట్టాలని ట్రంప్ కోరారు. ఆయన దృష్టిలో ముస్లింలంతా అమాయకులు, అవివేకులు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్‌లో మైనారిటీలపై దాడులు బాగా పెరిగిపోయాయి. ఓ వర్గాన్ని అణిచివేయాలని ట్రంప్ కుట్ర పన్నారు. ఉగ్రవాదంపై బ్రిటన్ ఉక్కుపాదం మోపుతోంది. అయితే, ఉగ్రవాదాన్ని నిర్మూలించుటలో బ్రిటన్ విఫలమైందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా' అని సాదిఖ్ ఖాన్ అన్నారు.