Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ అమెరికా యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే తాను ఇరాన్‌తో సాయుధ ఘర్షణను కోరుకోవటం లేదని అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేనినీ కొట్టి పారేయలేమన్నారు. 'యుద్ధానికి ఎప్పుడూ అవకాశం వుంది. అయితే నేను దానిని కోరుకోవటం లేదు. కానీ ఆ ఛాన్స్ మాత్రం వుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగానే వున్నానని, అయితే ఇరాన్ అణ్వాయుదాలను సమకూర్చుకోవటాన్ని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చిచెప్పారు. వారిని అణ్వాయుధాలను సమకూర్చు కోనివ్వబోమని ఆయన పునరుద్ఘాటిం చారు. తనకు అణ్వాయుధాలపై కొంతమేర అవగాహణ ఉందని, వాటిపై శిక్షణ పొంది, అధ్యయనం చేసిన వారిలో తానూ ఒకడినని ఆయన వివరించారు. అమెరికా అణ్వాయుధ సంపత్తికి బాధ్యత వహిస్తున్న వ్యక్తిగా తను పూర్తి బాధ్యతతో మాట్లాడుతున్నానని, అణ్వాయుధ వినియోగం ఒక బాధ్యత అని, దానిని నిర్వహించేందుకు తాను సిద్ధమవుతున్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో వున్న ట్రంప్ పర్యటనకు బయల్దేరే ముందు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ మీడియాలో ఆయన పర్యటన చివరి రోజు ప్రసారమవుతుండటం విశేషం. 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుండి గత ఏడాది వైదొలగిన అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలకు బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల మద్దతును కూడగట్టేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్‌కు వ్యతిరేకంగా తాము అనుసరిస్తున్న వైఖరిని బ్రిటన్ ప్రభుత్వానికి వివరించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి హెచ్చరిక జారీ చేస్తూ మధ్యప్రాచ్యంలో అమెరికా తన బలగాలను మోహరిస్తున్న విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాలలో వున్న తమ దేశీయులపై దాడులకు ఇరాన్ ప్రయత్నిస్తోందని, సౌదీ తీరంలో నిలిచి వున్న ఎమిరేట్స్ చమురు టాంకర్లపై జరిగిన దాడి ఇందులో భాగమేనని ఆరోపిస్తున్న అమెరికా అందుకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమవుతోంది. అమెరికా ఆరోపణలను గట్టిగా తిరస్కరిస్తున్న ఇరాన్ తాము అమెరికా సైన్యం దూకుడును అడ్డుకునేందుకు సిద్ధంగానే వున్నామంటూ హెచ్చరిస్తోంది. తాము చర్చలకు సిద్ధంగానే వున్నామంటున్న ఇరాన్ 'దెయ్యాలతో జరిపే చర్చలె'పుడూ సత్ఫలితాలనివ్వబోవని స్పష్టం చేస్తోంది.