Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాకు ట్రంప్ బెదిరింపు
వాషింగ్టన్: అవసరమైతే మరో 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను మరోసారి బెదిరించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చల్లో ఒక ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన గురువారం ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరే ముందు ఇక్కడ తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. తాము చైనాతో చర్చలు కొనసాగిస్తున్నామని, ఈసందర్భంగా అనేక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు వున్నాయని అన్నారు. ఏమి జరుగుతుందో చూస్తామని, అవసరమైతే మరో 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తానని, తగిన సమయంలో ఆ చర్య తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే ఏఏ వస్తువులపై సుంకాలు విధిస్తారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. తమతో వాణిజ్య పోరు కొనసాగిస్తున్న చైనా, మెక్సికోలతోపాటు మరే దేశమైనా తమతో అవగాహనకు వస్తుందని తాను భావిస్తున్నానన్నారు. వచ్చే వారం నుండి మెక్సికన్ దిగుమతులపై ఐదు శాతం అదనపు సుంకాలను విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమతో అవగాహన కుదుర్చుకునేందుకు చైనా ఇప్పటికే సిద్ధంగా వుందని భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్ మెక్సికో కూడా ఇదే ఆలోచనలో వున్నట్లు భావిస్తున్నానన్నారు.