Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో నిందితుడు
వాషింగ్టన్ : న్యూయార్క్ నగరంలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. నిందితునికి ఐఎస్‌తో సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైందని అన్నారు. న్యూయార్క్ పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలసవచ్చిన అషిఖుల్ ఆలమ్ (22) అనే యువకుడు న్యూయార్క్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టైమ్ స్క్వేర్‌లో దాడులకు కుట్ర పన్నాడు. మన్‌హట్టన్ జిల్లాలో ఆయుధాలు, తుపాకులు, మందు గుండు సామాగ్రి కొనుగోలు చేశాడు. పేలుళ్లకు పాల్పడేందుకు రెక్కీ నిర్వహించాడు. టైమ్ స్క్వేర్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి దిగాలని నిర్ణయించుకున్నాడు. మరో రెండు గ్లాక్-19 తుపాకులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. బ్రూక్లిన్ ప్రాంతంలో ఆలమ్ని అదుపులోకి తీసుకున్నట్టు న్యూయార్క్ పోలీసులు ధ్రువీకరించాడు. అతని వద్ద లభించిన తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గతేడాది ఆగస్టులో అతను ఐఎస్ సభ్యులతో సమావేశమైనట్టు విచారణలో వెల్లడైంది. న్యూయార్క్ నగరంలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఐఎస్ సభ్యుడితో ఆలమ్ చర్చించినట్టు తెలిసింది. ఈఏడాది జనవరిలో ఆలమ్ రెక్కీ నిర్వహించి పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.