Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం క్యూబాపై అమలు చేస్తున్న ఆంక్షలతో ఆ దేశంలోని ప్రయివేటు రంగానికి భారీగా దెబ్బతగిలిందని స్థానిక మీడియా పేర్కొంది. ఆంక్షల దెబ్బకు క్యూబాలోని హస్తకళల ఉత్పత్తుల విక్రయాలు 60 నుండి 80 శాతం మేర పడిపోయాయని వెల్లడించింది. ఇటీవల లారాంపాలో జరిగిన హస్తకళల ప్రదర్శన సమయంలో ఈ ఆంక్షల ప్రభావం ఎక్కువగా కన్పించిందని కార్మిక సంఘ నేత హెక్టర్ డానిలో రోడ్రిగ్జ్ చెప్పారు. క్యూబాకు వచ్చే సందర్శకులపై ట్రంప్ సర్కారు ఆంక్షలు విధించటంతో అది క్యూబా పర్యాటక రంగంపై నేరుగా ప్రభావం చూపుతోందని ఆయన వివరించారు. విక్రయాలు పడిపోవటంతో తమ కుటుంబాల ఆదాయంతో పాటు పన్నుల చెల్లింపుపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. అమెరికన్ సర్కారు అమలు చేస్తున్న హెల్మ్స్ అండ్ బర్టన్ చట్టం ప్రభావంతో తాము అవసరమైన ముడి సరుకును నేరుగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, హస్తకళల ఉత్పత్తులు తగ్గిపోవటంతో విక్రయాలు కూడా పడిపోయాయని, దీనితో పర్యాటకరంగం కుదేలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆంక్షల ప్రభావంపై స్పందించిన క్యూబా అధికారులు తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే ఆరు రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.