Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలకతీతంగా చీలిపోనున్న సభ్యులు
సిడ్నీ: ఏకలింగీయుల(గే) మధ్య వివాహాలకు అనుమతించే ప్రైవేట్ బిల్లు ఆస్ట్రేలియా పార్లమెంట్‌ను పార్టీలకతీతంగా చీల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార లిబరల్ పార్టీ సభ్యుడు వారెన్ ఎంట్చ్ ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ గే వివాహాలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఐతే,గత వారమే దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని టోనీ అబాట్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేథలిక్ మతాచార్యుడిగా శిక్షణ పొందిన టోనీ అబాట్‌కు సంప్రదాయవాదిగా పేరుంది. ప్రస్తుత పార్లమెంట్ కాలం పూర్తయ్యేవరకూ వివాహ చట్టంలో ఎటువంటి మార్పునూ తన ప్రభుత్వం కోరుకోవడంలేదని అబాట్ స్పష్టం చేశారు. గే వివాహాలకు చట్టబద్ధత లేకున్నా,ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలు వాటిని సమర్థించే పౌర సంఘాలకు అనుమతిస్తున్నాయి. ఎవరికివారు గే వివాహాలు చేసుకుంటున్నప్పటికీ వాటికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంలేదు.
లిబరల్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారికంగా బిల్లును వ్యతిరేకించడమే కాకుండా తమ పార్టీ సభ్యులు సొంత నిర్ణయం తీసుకునేందుకు నిరాకరించింది. దాన్ని తిరస్కరిస్తూ అధికార పార్టీకి చెందిన సభ్యుడే ఇప్పుడు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల పార్టీలకతీతంగా సభ్యులు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఫెయిర్ ఫ్యాక్స్ నిర్వహించిన సర్వేలోనూ ప్రజాభిప్రాయం బిల్లుకు అనుకూలంగా వచ్చింది. 69 శాతంమంది గే బిల్లుకు అనుకూలంగా తీర్పు చెప్పారు. అదే మీడియా ఐదేళ్ల క్రితం చేసిన సర్వేలో 57 శాతం మాత్రమే అనుకూలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ గే వివాహాలకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతానికి గే బిల్లుపై చర్చను పార్లమెంట్ వాయిదా వేసింది. తిరిగి ఎప్పుడు చేపట్టేదీ వెల్లడించలేదు. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాలు గే వివాహాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి.